గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నాలుగు మృతదేహాలు

Four Dead Bodies Found in Kakinada Godavari East Godavari - Sakshi

తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు మృతదేహాలు కొట్టుకురావడంతో కేసులు నమోదు చేసి రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించామని జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ శుక్రవారం రాత్రి విలేకర్లకు తెలిపారు. ఈ మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉన్నాయన్నారు. బొబ్బర్లంక బ్రిడ్జి వద్ద గోదావరి నదిలో మూడు మృతదేహాలు, ధవళేశ్వరం బ్రిడ్జి వద్ద ఒక మృతదేహాన్ని గుర్తించామన్నారు. బొబ్బర్లంక వద్ద గుర్తించిన మగ మృతదేహం ఎడమ భుజంపై తేలు ఆకారంలో ఉన్న పచ్చబొట్టు, కుడి భుజంపై డమరకంతో ఉన్న త్రిశూలం, సూర్లు ఆకారంలో పచ్చబొట్టు ఉందన్నారు.

రెండోది మహిళ మృతదేహమని దీనిపై ముదురు గ్రీన్‌ కలర్‌ టాప్, పువ్వులు ఆకులతో నలుపు, తెలుపు రంగు డిజైన్లతో ఉన్న లెగ్గిన్‌ ఉందన్నారు. అదే విధంగా మూడో మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉందన్నారు. నాలుగో మృతదేహం ధవళేశ్వరం బ్రిడ్జి వద్ద మగశవం నూలు చింత పిక్క రంగు గళ్ల చొక్కా, కాఫీరంగు జీను ప్యాంటు, నలుపురంగు బెల్టు ధరించి ఉందన్నారు. మొత్తం నాలుగు మృతదేహాలు గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉండడంతో వీటిని పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారన్నారు. ఈ మృతదేహాలు దేవీపట్నం సమీపంలోని కచ్చులూరులోని బోటు ప్రమాదంలో కనిపించకుండా పోయినవారి  బంధువులెవరైనా వచ్చి గుర్తు పట్టాలని ఎస్పీ వివరించారు. ఈ మృతదేహాలను గుర్తు పట్టేందుకు వచ్చే వారు రాజమహేంద్రవరంలోని పోలీస్‌ యూనిట్‌ ప్రతినిధి, సీఐ ఎన్‌ రజనీకుమార్‌ను సంప్రదించాలని ఎస్పీ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top