మాతృవేదన కదిలించింది! 

A Football Player has become a terrorist in Kashmir - Sakshi - Sakshi

తల్లి వీడియోతో ఉగ్రవాదం వీడిన యువకుడు 

కశ్మీర్‌: ఉగ్రప్రసంగాలకు లోనయ్యాడో.. భావోద్వేగాలకు గురయ్యాడో తెలియదు గానీ.. కశ్మీర్‌లో ఉగ్రవాదిగా మారిన ఓ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు వారం రోజులకే లొంగిపోయాడు. స్థానిక అనంత్‌నాగ్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ గోల్‌ కీపర్‌గా మాజిద్‌ ఖాన్‌ అందరికీ సుపరిచితమే. మైదానంలో చురుగ్గా కదిలే గోల్‌కీపర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ, ఏం జరిగిందో ఏమోగానీ.. ఉన్నపలంగా లష్కర్‌–ఎ– తయ్యబా ఉగ్రవాద సంస్థలో చేరాడు. అతను తుపాకులు పట్టుకున్న ఫొటోలు ఫేస్‌బుక్‌లో వైరల్‌ అయ్యాయి. ఆ ఫొటోలు చూసిన మాజిద్‌ఖాన్‌ తల్లిదండ్రులు గుండె పగిలినంత పనైంది. 

హాల్‌లోని షెల్పుల్లో కొడుకు సాధించిన ట్రోఫీలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కుమారుడిని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని బాగా ఆలోచించారు. మాజిద్‌ ఇంటికి తిరిగి రావాలని ప్రాధేయపడుతూ ఓ వీడియో సందేశాన్ని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. 20 ఏళ్లు కూడా నిండని నీవు ఇలా పెడదోవ పట్టొద్దని కోరారు. ఈ లోపు మాజిద్‌ ఉంటున్న స్థావరంపై పోలీసుల దాడి చేశారు. ఆ కాల్పుల్లో మాజిద్‌ స్నేహితుడు చనిపోయాడు. దీంతో చలించిపోయిన మాజిద్‌ పునరాలోచనలో పడ్డాడు. అదే సమయంలో తల్లిదండ్రుల వీడియో మాజిద్‌కు చేరింది. 

ఇక తాను అక్కడ ఉండలేనని నిర్ణయించుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్‌ చేశాడు. తరువాత నేరుగా సైనికాధికారుల వద్దకు వెళ్లి లొంగిపోయారు.  నిద్రాహారాలు మానేసి ఎదురుచూస్తున్న తల్లి ఈ విషయం తెలిసి.. తన ప్రార్థనలు ఫలించాయంటోంది. కొడుకు స్థావరంలో ఎన్‌కౌంటర్‌ వార్త విన్న తండ్రి అహ్మద్‌ఖాన్‌ గుండెపోటు వచ్చింది. కొడుకు లొంగిపోయాడన్న సమాచారం విని మెల్లిగా కోలుకుంటున్నాడు. తన కొడుకు మళ్లీ ఫుట్‌బాల్‌ ఆడాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

మీ కుమారులను పిలవండి 
మాజిద్‌ఖాన్‌ తల్లి ప్రయత్నం వల్ల భావి ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు వెనక్కి వచ్చాడని సీఎం మెహబూబా ముఫ్తీ ట్వీట్‌ చేశారు. ఉగ్రవాదుల్లో చేరిన మీ కుమారులందరినీ వెనక్కి రావాలని పిలవాలని కశ్మీర్‌ డీజీపీ ఎస్‌.పీ వేద్‌ వారి మాతృమూర్తులకు ట్విట్టర్‌ విజ్ఞప్తి చేశారు. బుర్హన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ తరువాత కశ్మీర్‌ యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారు. ఏడాది కాలంలో దాదాపు 100మంది నూనూగు మీసాల యువత భావోద్వేగాలతో పాక్‌ ఉగ్రవాద సంస్థల చేతిలో ఆయుధాలుగా మారారు. అందుకే, మిగిలినవారు కూడా మాజిద్‌ఖాన్‌ బాటలో నడవాలని అంతా ఆకాంక్షిస్తున్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top