తండ్రీకొడుకుల సట్టా దందా

father and son arrest in Speculators  - Sakshi

సికింద్రాబాద్‌ కేంద్రంగా వ్యవహారం

అరెస్టు చేసిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, సిటీబ్యూరో: సింగిల్‌ నెంబర్‌ లాటరీని పోలిన జూదం సట్టాను సికింద్రాబాద్‌ కేంద్రంగా వ్యవస్థీకృతంగా నిర్వహిస్తున్న తండ్రీకొడుకుల్ని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరితో పాటు పది మంది దళారుల్ని కూడా పట్టుకున్నారు.  వారినుంచి నగదు, సట్టా సంబంధిత మెటీరియల్‌ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. నగరంలోని కాప్రా సర్కిల్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ జమాల్‌ అలియాస్‌ ఆర్కే నగర వ్యాప్తంగా సట్టా దందా నిర్వహిస్తున్నాడు. మార్కెట్‌లోని శివాజీ నగర్‌కు చెందిన తండ్రీకొడుకులు ఎం.కృష్ణమూర్తి, ఎం.శ్రీనివాస్‌ ఇతడి ఆధీనంలో పని చేస్తూ సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సట్టా నిర్వహిస్తున్నారు. వీరిద్దనూ సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన చిరుద్యోగులు, కార్మికుల్ని దళారులుగా ఏర్పాటు చేసుకున్నారు.

సట్టాలో పందెం కాసేవాళ్ళ నుంచి ఫోన్‌ ద్వారా వ్యవహారాలు నడిపిస్తున్న తండ్రీకొడుకులు వారికి సట్టా స్లిప్స్‌ అందించడం, నగదు వసూలు చేసుకురావడం తదితర వ్యవహారాలను దళారులకు అప్పగిస్తున్నారు. ఈ పని చేసినందుకు వీరికి రోజులకు రూ.200 నుంచి రూ.400 వరకు కమీషన్‌గా చెల్లిస్తున్నరు. ఈ గ్యాంగ్‌ సట్టాలో పెట్టుబడి పెడితే తక్షణం సొమ్ము రెట్టింపు అవుతుందంటూ అనేక మంది ఎర వేస్తూ ఈ దందాలోకి దింపుతున్నారు. సట్టా నెంబర్‌ తగిలిన వారికీ ఆ విషయం చెప్పకుండా దాచి పెడుతూ వారి సొమ్మునూ స్వాహా చేసి మోసం చేస్తున్నారు. ఈ గ్యాంగ్‌ వలలో పడి సర్వం కోల్పోతున్న వారిలో దినసరి కూలీలు, చిరు వ్యాపారులు, కార్మికులు, ఆటోడ్రైవర్లు తదితరులే ఎక్కువగా ఉంటున్నారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని బృందం బుధవారం వరుసదాడులు చేసింది. కృష్ణమూర్తి, శ్రీనివాస్‌లతో పాటు దళారులు, పంటర్స్‌ అయిన దీపక్‌ జైన్, ఎం.రాజు, ఎం.అంజయ్య, వి.మోజెస్, వీపీ లోకనాథ్, ఎస్‌.సంతోష్‌కుమార్, జి.సోమయ్యల్ని అరెస్టు చేసింది. వీరి నుంచి సట్టా మెటరియ్‌తో పాటు రూ.14 వేల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం మార్కెట్‌ పోలీసులకు అప్పగించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top