ఇక మాకు దిక్కెవరయ్యా..!

Farmer Died With Power Shock in Anantapur - Sakshi

విద్యుదాఘాతంతో రైతు మృతి 

విషాదంలో ముకుందాపురం

తోటి రైతుకు సహాయం చేసేందుకు వెళ్లిన ఓ రైతును విద్యుదాఘాతం రూపంలో మృత్యువు కబళించింది.     విగతజీవిగా పడి ఉన్న రైతును చూసి ‘దేవుడా...     ఇక మాకు దిక్కెవరయ్యా’ అంటూ కుటుంబ సభ్యులు రోదించడం కలచి వేసింది. ఈ ఘటనతో ముకుందాపురంలో విషాదం అలుముకుంది.

గార్లదిన్నె : గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన వేమారెడ్డి తన కుమారుడు గోవర్ధన్‌రెడ్డితో కలిసి యర్రగుంట్ల సమీపాన గల తమ పొలంలో మంగళవారం పైపులైన్‌కు మరమ్మతులు చేస్తున్నారు. అయితే వీరికి పైపులు సరిగా అమర్చడం రాకపోవడంతో సహాయం కోసం తమ గ్రామంలో ఉన్న రైతు రామాంజనేయులు(38)కు ఫోన్‌ చేసి పిలిపించారు. అప్పటికే వేమారెడ్డి పైపులైన్‌ మరమ్మతుల కోసం గుంత తవ్వారు. రామాంజనేయులు గుంతలోకి దిగి పైపులైన్‌కు మరమ్మతులు చేస్తూ పక్కనే ఉన్న ఇనుప కంచెను ఆసరా కోసం పట్టుకున్నాడు. ఆ కంచెపై స్టార్టర్‌ పెట్టె ఉన్నింది. ప్రమాదవశాత్తు పెట్టెలో ఉన్న వైర్లు అర్త్‌ కావడంతో ఇనుప కంచెకు విద్యుత్‌ సరఫరా అయ్యింది. రామాంజనేయులు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రామాంజనేయులును కాపాడాలని ప్రయత్నించిన వేమారెడ్డి కూడా విద్యుత్‌ షాక్‌తో స్వల్పంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న రామాంజనేయులు భార్య లక్ష్మినారాయణమ్మ, కుటుంబ సభ్యులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని బోరున విలపించారు. ఎస్‌ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.

విషాదంలో కుటుంబ సభ్యులు
రైతు రామాంజనేయులుకు మూడు ఎకరాల పొలం ఉంది. అందులో చీనీ సాగు చేయడంతో పాటు గ్రామంలో డ్రిప్‌ పనులకు కూడా వెళ్తూ జీవనం సాగించేవాడు. భార్య లక్ష్మీనారాయణమ్మ వికలాంగురాలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విద్యుదాఘాతంతో భర్త చనిపోయాడని విషయం తెలియగానే భార్య కన్నీరుమున్నీరయ్యింది. ‘మమ్మల్ని అనాథులు చేసి వెళ్లి పోయావా.. ఇంక మేము ఎట్లా బతికేది దేవుడా అంటూ బోరున విలిపించడం చూపరులను కలచివేసింది.  

విద్యుత్‌తీగలు తగిలి వివాహిత మృతి
కనగానపల్లి: ముక్తాపురంలో విజయలక్ష్మి(28) అనే వివాహిత విద్యుదాఘాతంతో మృతి చెందింది. స్థానికులు తెలిపిన  మేరకు.. గ్రామానికి చెందిన లక్ష్మిరెడ్డి భార్య విజయలక్ష్మి ఇంటి దగ్గర ఉన్న నీటి కుళ్లాయి మోటర్‌కు ఏర్పాటు చేసుకొన్న విద్యుత్‌ తీగలను గుర్తించకుండా తడిగుడ్డతో తాకింది. దీంతో ఆమె విద్యుదాఘాతానికి గురైంది. ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవటంతో ఆమెను రక్షించేవారు లేక అలాగే తీగలు పట్టుకొని చనిపోయింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్‌ఐ వేణుగోపాల్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top