ఫ్లిప్‌కార్ట్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌

Fake Website in internet With Flipkart Name Hyderabad - Sakshi

90 నుంచి 95 శాతం డిస్కౌంట్‌ అంటూ ఆఫర్లు

సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ ఈకామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ పేరుతో ఇంటర్‌నెట్‌లో నకిలీ యూఆర్‌ఎల్‌ రూపొందింది. దీని ఆధారంగా వివిధ ఆఫర్ల పేరుతో ప్రచారం చేసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు అందినకాడికి దండుకుంటున్నారు. ఈ సైట్‌ ద్వారా ఏకంగా 90 నుంచి 95 శాతం డిస్కౌంట్‌ అంటూ ఎర వేస్తున్నారు. ఈ సైట్‌ను నమ్మి మోసపోయిన ఓ వ్యక్తి బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ అనేక ఆఫర్లు ఇస్తున్నట్టు ఆ సంస్థ లోగో, డిజైన్‌ను వినియోగించి కొందరు సైబర్‌ నేరగాళ్లు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రకటనతో పాటు టుడే స్పెషల్‌ ఆఫర్‌ పేరుతో ఓ యూఆర్‌ఎల్‌ను పొందుపరిచారు.

ఎవరైనా ఆకర్షితులై క్లిక్‌ చేస్తే అది నేరుగా సైబర్‌ నేరగాళ్లు ఏర్పాటు చేసిన నకిలీ సైట్‌లోకి తీసుకువెళ్తోంది. అక్కడ అనేక ఖరీదైన ఫోన్లు 90 నుంచి 95 శాతం వరకు తగ్గించి విక్రయిస్తున్నామంటూ ఆ ఫోన్ల ఫొటోలతో సహా ఉంటున్నాయి. కొందరు ఆ సైట్‌లోనే ఫోన్లు బుక్‌ చేసి, అమౌంట్‌ కూడా పంపిస్తున్నారు. ఎంతకూ ఫోన్లు రాకపోగా ఆరా తీయడంతో మోసపోయినట్టు తెలుసుకుంటున్నారు. ఇదే పంథాలో నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి నకిలీ సైట్‌ ద్వారా రూ.2900 పోగొట్టుకునిబుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరహా నకిలీ సైట్లు మరికొన్ని ఉంటాయని, లావాదేవీలు చేసే ముందు సరిచూసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కోరారు. సైబర్‌ నేరగాళ్లు మరో ముగ్గురిని కూడా ఇదే తరహాలో మోసం చేశారు. ఈ ముగ్గురు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసులు నమోదయ్యాయి. 

నగరంలో పనిచేస్తున్న ఓ ఆర్మీ అధికారికి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు తక్కువ వడ్డీకి రుణం ఇస్తామంటూ ఎర వేశారు. ప్రాసెసింగ్‌ సహా వివిధ చార్జీల పేరుతో ఆయన నుంచి రూ.79 వేలు కాజేశారు.  
ఆన్‌లైన్‌లో చూసి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మరో యువతి నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.49 వేలు స్వాహా చేశారు.  
ముషీరాబాద్‌కు చెందిన ఓ యువకుడు తన ఇంట్లో ఉన్న బెడ్‌ విక్రయిస్తానంటూ ఓఎల్‌ఎక్స్‌లో పొందుపరిచాడు. ఓ సైబర్‌ నేరగాడు రూ.9 వేలకు కొంటానంటూ ఆ యువకుడితో ఒప్పందం చేసుకున్నాడు. చెల్లింపుల వ్యవహారం పరీక్షించాలి అంటూ తొలుత నగరవాసి నుంచి గూగుల్‌ పే ద్వారా రూ.4 వేలు తన ఖాతాకు పంపేలా చేశాడు. ఆపై మొత్తం రూ.13 వేలు చెల్లిస్తున్నానంటూ సైబర్‌ నేరగాడు ఓ క్యూఆర్‌ కోడ్‌ను నగరవాసికి పంపాడు. దానికి పైన ఉన్న టెక్స్ట్‌లో రూ.13 వేలు తనకు వస్తున్నట్టు ఉండటంతో బాధితుడు క్లిక్‌ చేశాడు. అయితే కోడ్‌ మాత్రం తనకు రూ.61 వేలు తనకు వచ్చేలా రూపొందించాడు. దీంతో బాధితుడి ఖాతా నుంచి రూ.61 వేలు సైబర్‌ నేరగాళ్లకు చేరాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top