హత్యాయత్నం కేసుపై డీఎస్పీ దర్యాప్తు

DSP Enquiry on Murder Attempt case Vizianagaram - Sakshi

రక్తం మరకలు పడిన చున్నీ, దిండు,  చెవి రింగు స్వాధీనం

శివరామరాజుపేట, ఆకులసీతంపేట గ్రామాల్లో సాక్షుల నుంచి వాంగ్మూలం  

శృంగవరపుకోట రూరల్‌: మండలంలోని శివరామరాజుపేట గ్రామంలో ఎస్సీ యువతి జుంజూరు శిరీష(19)పై వేపాడ మండలం ఆకులసీతంపేట గ్రామానికి చెందిన సుంకరి బంగారుబుల్లయ్య అనే ఆటో డ్రైవర్‌ ఇటీవల హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై విజయనగరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ 1 డీఎస్పీ బి.మోహనరావు శుక్రవారం దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఎస్‌.కోట ఎస్‌ఐ ఎస్‌.అమ్మినాయుడు, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి  శిరీషపై హత్యాయత్నం జరిగిన శివరామరాజుపేట గ్రామంలో బంధువుల ఇంటిని పరిశీలించారు. నిందితుడు దాడి చేసిన సమయంలో అక్కడే పడి ఉన్న పలు వస్తువులను వీఆర్‌ఓ అప్పలరాము, ఇతర పెద్దల సమక్షంలో డీఎస్పీ స్వాధీనం చేసుకున్నారు. 

సాక్షుల నుంచి వాంగ్మూలం నమోదు
ముందుగా హత్యాయత్నానికి గురైన జుంజూరు శిరీష తల్లి సూరీడమ్మను డీఎస్పీ మోహనరావు విచారించగా.. తమ స్వగ్రామం వేపాడ మండలం ఆకులసీతంపేట గ్రామమని, 2007లో తన భర్త శ్రీను మృతి చెందటంతో ఉన్న ఒక్కగానొక్క కుమార్తెతో కలిసి గంట్యాడ మండలం పెదమధుపాడ గ్రామంలో  కన్నవారింటికి వెళ్లి జీవిస్తున్నట్లు స్పష్టం చేసింది. గతంలో ఆకులసీతంపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ బంగారుబుల్లయ్య తన కుమార్తెను వేధింపులకు గురి చేస్తే అక్కడి గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లామని, పెద్ద మనుషులు బంగారుబుల్లయ్యను వారించి ఇకపై శిరీష జోలికి రానంటు ఒక లేఖ కూడా రాయించారని తెలియజేసింది. నాలుగు రోజుల కిందట నా కుమార్తె శిరీష పేరున బ్యాంకులో ఖాతా తెరిచేందుకు ఇద్దరం వెళ్లామని,  సమయం మించి పోవటంతో మరొక రోజు రమ్మన్నారని చెప్పటంతో కుమార్తె శిరీష సమీపంలో గల శివరామరాజుపేటలోని తన అక్క గారింటికి వెళ్లగా తాను పెదమధుపాడ వెళ్లిపోయానని వాంగ్మూలం ఇచ్చింది.  శిరీషపై హత్యాయత్నానికి పాల్పడి ఇంట్లో నుంచి నిందితుడు వెళ్లిపోతున్న సమయంలో  చూసిన శిరీష పెద్దమ్మను, మావయ్య గౌరినాయుడు, మరో ప్రత్యక్ష సాక్షి ముచ్చకర్ల చిరంజీవి సూర్యనారాయణను డీఎస్పీ విచారించి వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

అనంతరం నిందితుడు బంగారుబుల్లయ్య, హత్యాయత్నానికి గురైన బాధిత యువతి శిరీషల స్వగ్రామమైన వేపాడ మండలంలోని ఆకులసీతంపేట గ్రామానికి వెళ్లి అక్కడి మాజీ ఎంపీటీసీ అడపా ఈశ్వరరావు, మాజీ సర్పంచ్‌ మంచిన అప్పలసూరి తదితరులను డీఎస్పీ విచారించారు. డీఎస్పీ వెంట ఎస్‌.కోట ఎస్‌ఐ అమ్మినాయుడు, వేపాడ ఎస్‌ఐ తారకేశ్వరరావు, ఇతర పోలీసు సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top