చుక్కేసి నడిపారు... చుక్కలు చూశారు!

Drunk And Drive Cases Files In Hyderabad - Sakshi

నెల రోజుల్లో రూ.66.77 లక్షల జరిమానా చెల్లింపు

ముగ్గురికి రెండు నెలలు, ఇద్దరికి నెల రోజుల జైలు

మొత్తం జైలుకెళ్లింది 611 మంది, 16 మంది డీఎల్స్‌ రద్దు

మైనర్‌ డ్రైవింగ్‌తో ఏకంగా 13 మంది జువైనల్‌ హోమ్‌కు

నగర అదనపు సీపీ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ వెల్లడి

సాక్షి, సిటీబ్యూరో: ఓ పక్క మద్యం తాగి వాహనాలు నడపటం... మరో పక్క మైనర్లు డ్రైవింగ్‌ చేయడం... ఇంకోపక్క సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌... ఇలా తీవ్రమైన ఉల్లంఘనులపై ట్రాఫిక్‌ పోలీసులు కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేస్తున్నారు. వీటిని న్యాయస్థానం సైతం తీవ్రంగా పరిగణిస్తోంది. వీటికి సంబంధించి గత నెలలో నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లలో 3082 మంది పట్టుబడ్డారు. వీరిలో మందుబాబులు న్యాయస్థానాల్లో చెల్లించిన జరిమానా అక్షరాలా రూ.66,77,800. దీనికితోడు 611 మంది జైలుకు వెళ్లగా... 86 మంది డ్రైవింగ్‌ లైసెన్సులను (డీఎల్స్‌) న్యాయస్థానం శాశ్వతంగా రద్దు చేయడమో, సస్పెండ్‌ చేయడమో జరిగిందని అదనపు పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ బుధవారం వెల్లడించారు. మైనర్‌ డ్రైవింగ్‌ కేసులో 13 మందిని జువైనల్‌ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ నెల రోజుల కాలంలో మరో ఐదు రకాలైన తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడి చిక్కిన 76 మంది వాహనచోదకులకు కోర్టులు జైలు శిక్షలు విధించాయన్నారు.

డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసుల్లో చిక్కిన వారి మద్యం తీసుకున్న మోతాదు తదితరాలు పరిశీలించిన కోర్టు 16 డ్రైవింగ్‌ లైసెన్సులను పూర్తిగా రద్దు చేయగా... నలుగురివి ఐదేళ్లు, ఐదుగురివి నాలుగేళ్లు, తొమ్మిది మందివి మూడేళ్లు, 27 మందివి రెండేళ్లు, 20 మందివి ఏడాది, ఐదుగురివి ఆరు నెలల పాటు సస్పెండ్‌ చేసినట్లు ఆయన వివరించారు. జైలుకు వెళ్లిన మందుబాబుల్లో ముగ్గురికి రెండు నెలలు, ఇద్దరికి నెల రోజులు జైలు శిక్ష పడింది. వీరితో పాటు  నలుగురికి 20 రోజులు, పది మందికి 15 రోజులు, 28 మందికి 10 రోజులు, ఏడుగురికి ఎనిమిది రోజులు, 28 మందికి వారం, 13 మందికి ఆరు రోజులు, 87 మందికి ఐదు రోజులు, 61 మందికి నాలుగు రోజులు, 107 మందికి మూడు రోజులు, 261 మందికి రెండు రోజుల చొప్పున జైలు శిక్షలు విధించారు. డ్రంక్‌ డ్రైవింగ్‌తో పాటు మరో ఐదు రకాలైన ఉల్లంఘనల్నీ తీవ్రంగా పరిగణిస్తూ చార్జ్‌షీట్లు వేస్తున్నామన్నారు.

వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానాలు మైనర్‌ డ్రైవింగ్‌ కేసులో 13 మందిని జువైనల్‌ హోమ్‌కు తరలించేలా కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. వీరిలో 12 మందికి వారం రోజులు, ఒకరికి ఒక రోజు శిక్ష పడిందని వివరించారు. వీరితో పాటు సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేసిన ఒకరికి ఒక రోజు, 21 మందికి రెండు రోజులు, 20 మందికి మూడు రోజులు, ఒకరికి నాలుగు రోజులు... డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపటం నేరంపై ఆరుగురికి ఒకరోజు, మరో ఆరుగురికి రెండు రోజులు, నలుగురికి మూడు రోజులు, ఒకరికి నాలుగు రోజులు... భారీ స్థాయిలో ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న ఒకరికి రెండు రోజులు చొప్పున జైలు శిక్షలు పడ్డాయని ట్రాఫిక్‌ చీఫ్‌ పేర్కొన్నారు. ఇలాంటి ఉల్లంఘనులకు ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో కౌన్సిలింగ్స్‌ ఇస్తున్నామని, జైలు శిక్షలు పడిన వారికి భవిష్యత్తులో పాస్‌పోర్ట్స్, వీసాలు, ఉద్యోగాలు రావడంలో అడ్డంకులు ఎదురు కావచ్చని ఆయన హెచ్చరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top