డాక్టర్‌ ముజాహిద్‌... సిటీ ‘సల్మాన్‌’ | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ ముజాహిద్‌... సిటీ ‘సల్మాన్‌’

Published Mon, Apr 9 2018 3:25 AM

Deer hunting in the karnataka - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణజింకల వేటకు సంబంధించి మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌ సమీపంలో కృష్ణజింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ల శిక్ష పడటం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పూర్తిగా సద్దుమణగకముందే నగరానికి చెందిన ఓ ‘సల్మాన్‌ ఉదంతం’బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన డెంటిస్ట్‌ డాక్టర్‌ ముజాహిద్‌ అలీఖాన్‌ మరో ముగ్గురితో కలసి కర్ణాటకలోని బీదర్‌ ప్రాంతంలో ఈ నెల 29న కృష్ణజింకల్ని వేటాడారు. మరునాడు తిరిగి వస్తుండగా బసవకల్యాణ్‌ ప్రాంతంలో పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు.  

వేట కోసం సిటీ నుంచి వెళ్లి... 
ముజాహిద్‌ అలీఖాన్‌ వృత్తిరీత్యా దంతవైద్యుడు. దుబాయ్‌లో ఉంటున్న ఈయన ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. నగరానికే చెందిన స్నేహితులు సయ్యద్‌ అజర్, యాకూబ్‌లతో కలసి జీపులో గత నెల 29న బీదర్‌ ప్రాంతానికి వెళ్లారు. కర్ణాటకలోని హుమ్నాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌ అనే పరిచయస్తుడి నుంచి కృష్ణ జింకల సమాచారాన్ని సేకరించారు. రాత్రంతా హల్సూర్‌ గ్రామ సమీపంలో మూడు జింకల్ని వేటాడారు. మరునాడు జీపులో తిరిగి వస్తుండగా బీదర్‌కు 35 కి.మీ దూరంలో బసవకల్యాణ్‌ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వారి వద్ద మాంసంతోపాటు చర్మం, విదేశాల్లో తయారైన 0.22 క్యాలిబర్‌ రైఫిల్, తూటాలు, ఆరు కత్తులు లభించాయి. పోలీసులు ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, జీపును స్వాధీనం చేసుకున్నారు. హుమ్నాబాద్‌లో శ్రీకాంత్‌ను కూడా పట్టుకున్నారు.

వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సెక్షన్‌ 9, 51 ప్రకారం ఈ నలుగురిపై కేసులు నమోదు చేశారు. కేసును శనివారం బీదర్‌ అటవీ అధికారులకు అప్పగించారు. గతంలో రెండుసార్లు కర్ణాటకలో కృష్ణజింకల్ని వేటాడిన ఈ ముఠా ఎట్టకేలకు మూడోసారి పోలీసులకు చిక్కింది. తరచూ హైదరాబాద్, ఆ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అనేక మంది జింకల్ని వేటాడటం కోసం వస్తుండడంతో ఇటీవల నిఘా ముమ్మరం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement