వినికిడే అతడి పాలిట శాపం   | Deaf Man Died In Train Accident In Srikakulam | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాదంలో యువ రైతు మృతి

Jul 9 2018 12:13 PM | Updated on Sep 2 2018 4:52 PM

Deaf Man Died In Train Accident In Srikakulam - Sakshi

తారకేశ్వరరావు మృతదేహం  

సోంపేట/కాశీబుగ్గ : ఆ కుటుంబంలో పెద్ద దిక్కు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో తన రెక్కల కష్టంపై తల్లిని పోషిస్తున్న కుమారుడు రైలు ప్రమాదంలో మృతిచెందడంతో ఆమె రోదన గ్రామస్తులను కంటతడి పెట్టించింది.

ఈ హృదయ విదారకరమైన ఘటన కంచిలి మండలం జె.శాసనాం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దున్న హేమావతి భర్త పరుశురాముడు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈమెకు కుమార్తె మీనాక్షికి వివాహమైంది.

కుమారుడు తారకేశ్వరరావు (26) ఇంటి వద్ద ఉంటూ తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. మిగిలిన సమయాల్లో కూలీకి వెళ్తూ తల్లిని పోషిస్తున్నాడు. ఇతడికి చిన్న వినికిడి సమస్య ఉంది. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో సోంపేట మండలంలోని లక్కవరం గ్రామ సమీపంలోని రైల్వేట్రాక్‌ అవతల పొలం ఉంది. ఆదివారం మధ్యాహ్నం పొలాన్ని చూసేందుకు ట్రాక్‌ దాటున్నాడు. ఇదేక్రమంలో విశాఖ నుంచి వస్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను గమనించకపోవడంతో ఢీకొంది.

దీంతో ఎడమచేయి తెగిపడి తీవ్రంగా గాయపడగా పలాస ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని మార్చురీ గదిలో భద్రపరిచారు.

ఆశలదీపం ఆరిందని...

తన కాయకష్టంతో స్వంత ఇల్లు నిర్మాణం పనులు చేపడుతున్నాడు. ఇటీవల వివాహ నిమిత్తం కొద్దిరోజుల్లో నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతలో ట్రైన్‌ రూపంలో  మృత్యువు కబళించడంతో అతడి తల్లి గుండెలవిసేలా రోదిస్తుంటే ఆమెను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. 

ఈ మేరకు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పలాస రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement