సొంత ఇంటికే కన్నం

Daughterinlaw Robbed Home In Srikakulam - Sakshi

చోరీకి పాల్పడిన కోడలు

గుట్టుగా మాయం చేసిన 14తులాల బంగారం, రూ. 2.35 లక్షల నగదు

వివాహేతర సంబంధమే బరితెగించిందా!

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన     సంఘటన

లబోదిబోమంటున్న బాధిత         అత్తమామలు

శ్రీకాకుళం, సంతబొమ్మాళి: ఇంటికి వెలుగు ఇల్లాలు అన్నారు మన పెద్దలు. అలాంటి ఇల్లాలే పెడదారిపడితే ఆ కుటుంబం తలదించుకోవాల్సిందే. మండలంలోని తీరప్రాంత గ్రామమైన జగన్నాథపురంలో సొంత ఇంటికే కన్నం వేసింది కోడలు. బంగారం, నగదు దొంగిలించి ప్రియుడికి అప్పనంగా అప్పగించింది. కట్టుకున్న భర్త, అత్తమామలను మోసం చేసింది. బాధితులు విలేకరులతో మంగళవారం మాట్లాడుతూ జరిగిన సంఘటనను వివరించారు. జగన్నాథపురం గ్రామానికి చెందిన ముత్తు రామారావు, పుణ్యవతి దంపతుల కుమారుడైన పుష్పరాజుకు నరసన్నపేటకు చెందిన సొంత మేనకోడలైన నాగమణితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంతవరకు బాగానేవున్నా తన ఇంటి పక్కన ఉన్న కొమర రామారావుతో ఏడాది నుంచి వివాహేతర సంబంధం పెట్టుకొని తన అత్తమామలకు, భర్తకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చేది నాగమణి. అంతటితో ఆగకుండ తన ప్రియుడిని మరింత సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో తన ఇంటి బీరువాలో ఉన్న నగదు, బంగారంపై కన్ను పడింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా తెరిచి అందులో ఉన్న 14 తులాల బంగారం, రూ. 2.35 లక్షల నగదును దొంగిలించి ఒక చోట భద్రపరిచింది. బీరువా తాళాలను బియ్యం డబ్బాలోని అడుగున దాచిపెట్టింది. ఏమి తెలియని అమాయకురాలిగా ఉండిపోవడంతో అత్తమామలు తాళాలు పోయాయని అనుకున్నారు.

డమ్మీ తాళాలు చేయించి మా తమ్ముడు గణేష్‌ తెస్తాడని పలుమార్లు చెప్పి అత్తమామ, భర్తను నాగమణి నమ్మించింది. కొన్ని రోజుల తర్వాత తన తమ్ముడు గణేష్‌ ప్రమాదంలో చనిపోవడంతో నాగమణి తన కన్నవారి ఇంటికి వెళ్లింది. పెద్దకర్మ జరగకముందే మధ్యలో ఒక్కసారి అత్తవారి ఇంటికి వచ్చి తను భద్రపరిచిన బంగారం, నగదును ఎవరికీ తెలియకుండా తీసుకొని వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత బియ్యం డబ్బాలో ఉన్న బీరువా తాళాలు అత్త పుణ్యావతి కంట కనిపించాయి. దీంతో బీరువాను తెరువగా అందులో ఉన్న బంగారం, నగదు కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. దీంతో కోడలు నాగమణిని అత్తమామలు అడుగగా తనకు ఏమి తెలియదని సమాధానం చెప్పి తప్పించుకుంది. దీంతో జూలై 14 తేదీన సంతబొమ్మాళి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా కోడలు నాగమణి చేసిన తప్పును ఒప్పుకొంది. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. ఈ విషయమై రెండుసార్లు గ్రామపెద్దల సమక్షంలో సమావేశం జరగగా, ఆగస్టు 19న జరిగిన సమావేశంలో తను దొంగిలించిన నగదు, బంగారం అమ్మిన సొమ్మును తన ప్రియుడు కొమర రామారావుకు ఇచ్చిన్నట్టు నాగమణి ఒప్పుకుంది. తీరా ఇప్పుడు మూడు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తారని మాజీ సర్పంచ్‌ పుక్కళ్ల శ్రీనువాసరావు చెప్పుబున్నారని, దీనికి పోలీసులు కూడా వత్తాసు పలికారన్నారు. నా భర్త చెవిటివాడని, నా కొడుకు గుడ్డువాడని, నా ఇద్దరు మనవళ్లు నా దగ్గరే ఉన్నారని మీరే న్యాయం చేయాలని బాధితురాలు పుణ్యావతి కన్నీరుమున్నీరుగా విలపించారు.

కేసు నమోదు చేస్తామంటే వద్దాన్నారు
ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామంటే బాధితులు పుణ్యావతి వద్దన్నారని సంతబొమ్మాళి ఎస్‌ఐ బి.రామారావు తెలిపారు. మా కోడలు మాకు మేనకోడలేనని, పెద్దమనుషుల సమక్షంలో పరిష్కరించుకుంటామని, కేసు నమోదు చేయవద్దన్నారు. మూడు లక్షలు ఇస్తారంటే తీసుకుంటామని బాధితురాలు చెప్పారన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top