ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నేరాల నియంత్రణ

Crime control with Friendly Police - Sakshi

భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్‌ ఎస్పీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి

కొత్తగూడెం అర్బన్‌ : ఫ్రెండీ పోలీసింగ్‌తో నేరాలను సులభంగా నియంత్రించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్‌ ఎస్పీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. స్థానిక ఓఎస్డీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం జిల్లాలోని అధికారులు, సిబ్బంది, ఐటీ సెల్, డీసీఆర్బీ సిబ్బందితో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలని, వారి మనసులను చూరగొనేలా సేవలందించాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులకు అక్కడి సమస్యలను తెలిపిన వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా నేరాలను సులభంగా నియంత్రించవచ్చన్నారు.

పెండింగ్‌ కేసులను త్వరగా పూర్తి చేయడంలో కోర్టు అధికారులతో సమన్వయం పాటించాలని, కేసుల పురోగతిని ఎప్పటికప్పడు తెలుసుకోవాలని చెప్పారు. గుట్కా, మట్కా, పేకాట, గ్యాంబ్లింగ్‌ స్థావరాలపై ముమ్మరంగా దాడులు చేయాలన్నారు. సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థను ఇంకా పటిష్టం చేసుకోవాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. లైసెన్స్‌లేకుండా, మద్యం తాగి వాహనాలు నడిపే వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. చిన్న పిల్లలపై, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు దిగేవారిపై చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నేర నియంత్రణకు సాంకేతికపరమైన అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

ప్రతి సమాచారాన్ని వాటిలో నిక్షిప్తం చేసేలా అధికారులు, సిబ్బంది అంతా నైపుణ్యం సాధించాలన్నారు. అసాంఘిక శక్తులపై ఎప్పటికప్పడు సమాచారం సేకరించి ముందుగానే వాటిని అదుపు చేసేందుకు కృషి చేయాలన్నారు. తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై సస్పెక్ట్‌ షీట్స్, రౌడీషీట్లు తెరవాలని ఆదేశించారు. ఏజెన్సీ పోలీస్‌ స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేసుకోవాలని సూచించారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు.

వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఏఆర్‌ డీఎస్పీ కుమారస్వామి, కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌ఎం.అలీ, పాల్వంచ డీఎస్పీ శ్రీనివాసులు, మణుగూరు డీఎస్పీ ఆర్‌.సాయిబాబా, ఎస్పీ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు, నాగరాజు, ఐటీ సెల్, డీసీఆర్బీ సీఐ రమాకాంత్, సీసీఎస్‌ సీఐ శ్రీనివాస్, సీఐలు రవీందర్, షుకూర్, సిహెచ్‌.శ్రీనివాస్, టి.గోపి, కుమారస్వామి, కొండ్రు శ్రీను, సత్యనారాయణరెడ్డి, అల్లం నరేందర్, వెంకటేశ్వర్లు, అశోక్, దోమల రమేష్, అబ్బయ్య, ఆర్‌ఐలు కృష్ణ, సోములు, కామరాజు, ప్రసాద్, దామోదర్, స్టేషన్‌ రైటర్లు, ఐటీ సెల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top