శభాష్‌ సాగర్‌! | Sakshi
Sakshi News home page

శభాష్‌ సాగర్‌!

Published Sat, Sep 15 2018 8:41 AM

Constable Catch Thieves In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు బి.విద్యాసాగర్‌... మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌లో కానిస్టేబుల్‌... రామ్‌గోపాల్‌పేట ఠాణా ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు... గురువారం రాత్రి పక్కాగా పెట్రోలింగ్‌ విధులు నిర్వర్తించడమే కాకుండా ఒక్కడే ఉన్నా ఇద్దరు దోపిడీ దొంగలను పట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీపీ అంజనీ కుమార్‌ శుక్రవారం తన కార్యాలయానికి పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన తిమ్మప్ప ఓ స్టార్‌ హోటల్‌లో రూమ్‌బాయ్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి అతను నెక్లెస్‌రోడ్‌లో సంజీవయ్య పార్క్‌ మీదుగా నడిచి వెళుతుండగా, అర్ధరాత్రి పార్క్‌ వద్ద అతడిని అడ్డగించిన ముగ్గురు దుండగులు ఇటుకరాయితో దాడి చేశారు.

తీవ్రంగా గాయపడిన తిమ్మప్ప కిందపడిపోగా అతడి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌ దోచుకెళ్లారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌ చేస్తున్న సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ విద్యాసాగర్‌ తక్షణమే అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని అడిగి విషయం తెలుసుకున్నాడు.  దుండగులను వెంటాడి, వారి వాహనాన్ని ఆపడంతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు పారిపోకుండా నియంత్రిస్తూనే రామ్‌గోపాల్‌పేట అధికారులకు సమాచారం అందించాడు. దుండగుల్ని పోలీసులకు అప్పగించడంతో పాటు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. నిందితులు లోయర్‌ ట్యాంక్‌బండ్, గాంధీనగర్‌లకు చెందిన ఎండీ అమీర్, బి.నిఖిల్‌గా గుర్తించిన పోలీసులు వీరిచ్చిన సమాచారంతో మరో మైనర్‌ను పట్టుకున్నారు. నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌ శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావుల సమక్షంలో విద్యాసాగర్‌ను ప్రత్యేకంగా అభినందించడంతో పాటు రివార్డు ప్రకటించారు. 

Advertisement
Advertisement