ప్రేమించి మోసం చేశాడని ... | complained that he was fraudulent | Sakshi
Sakshi News home page

ప్రేమించి మోసం చేశాడని ...

Nov 4 2017 2:46 AM | Updated on Nov 4 2017 3:12 AM

complained that he was fraudulent - Sakshi

గోరంట్ల: ప్రేమ పేరుతో దగ్గరై గర్భవతిని చేసి.. ఆనక అబార్షన్‌ చేయించిన యువకుడిపై బాధితురాలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన మేరకు.. మండల కేంద్రం గోరంట్లలోని యండాలమ్మబండ వీధిలో నివసిస్తున్న ఫణిరాజు అనే యువకుడు, స్థానికురాలైన ఓ యువతి ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆరు నెలల కిందట ఆ యువకుడు బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్లాడు. మూడు నెలల తర్వాత తను ప్రేమిస్తున్న యువతిని చదువు పేరుతో అక్కడికే పిలిపించుకుని, హాస్టల్‌లో చేర్పించాడు. అలా ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత తండ్రి శ్రీనివాసులు మరణించడంతో ఫణిరాజు గోరంట్లకు వచ్చేశాడు. తిరిగి బెంగళూరుకు వెళ్లలేదు. మూడు నెలలుగా ముఖం చాటేయడంతో యువతి ఆందోళనకు గురై ఇటీవల గోరంట్లకు వచ్చింది. తాను ప్రస్తుతం గర్భవతినని, చెప్పా పెట్టకుండా వచ్చేస్తే తన పరిస్థితి ఏమిటి అంటూ యువకుడిని నిలదీసింది. ఆ యువతికి మాయమాటలు చెప్పి మంగళవారం నాడు కదిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్‌ చేయించాడు. ఇంటికి వచ్చిన యువతికి రక్తస్రావం అవుతుండటం గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. శుక్రవారం కుమార్తెను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై ఫిర్యాదు చేశారు.

బాధితురాలు ఆత్మహత్యాయత్నం
బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఇంటికి వచ్చాక సాయంత్రం విషపుగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన హిందూపురం ఆస్పత్రికి తరలించారు. తనకు న్యాయం జరుగుతుందో లేదోనని మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement