త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

College Bus Roll Overed in Srikakulam - Sakshi

 అదుపు తప్పి బోల్తా పడిన ఇంజినీరింగ్‌ కళాశాల బస్సు

స్వల్ప గాయాలతో బయటపడిన 8 మంది విద్యార్థులు

శ్రీకాకుళం , టెక్కలి/టెక్కలి రూరల్‌: మండలంలోని పరశురాంపురం జంక్షన్‌ సమీప జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సహా ఎనిమిది మంది విద్యార్థులు స్వల్ప గాయాలతోనూ మిగిలిన వారు సురక్షితంగానూ బయట పడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే... కళాశాల నుంచి పాతపట్నం వైపు వెళ్లేందుకు విద్యార్థులతో సాయంత్రం 4 గంటలకు బస్సు బయలు దేరింది. పరశురాంపురం జంక్షన్‌ రోడ్డులో మళ్లించే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి మెల్లగా రోడ్డుకు ఒక భాగంలోని కంకర మీదుగా వెళ్లి బోల్తా పడింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న మెళియాపుట్టి ఎస్‌ఐ రాజేష్‌ హుటాహుటిన చేరుకుని స్థానికుల సాయంతో గాయాలపాలైన విద్యార్థులను, బస్సు సిబ్బందిని రక్షించే ప్రయత్నాలు చేశారు. అనంతరం టెక్కలి పోలీసులకు సమాచారం అందజేశారు. హైవే అంబులెన్స్, 108 వాహనం సాయంతో గాయపడిన విద్యార్థులను టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ డీ లక్ష్మణరావుతోపాటు విద్యార్థులు ఎస్‌ సోనియా, ఆర్‌ తనూషా, కే గంగాధర్, పీ జయకృష్ణ, బీ లక్ష్మణరావు, ఎల్‌ సాయి, ఎస్‌ ప్రేమ, ఏ శివానీ తదితరులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో సోనియాను మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించే చర్యలు చేపట్టారు.

హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది అత్యుత్సాహంపై ఆగ్రహం
ఈ సంఘటనను చూసిన స్థానికులు కొంతమంది తమ వాహనాలను పార్కింగ్‌ చేసి సహాయక చర్యలు చేపడుతుండగా, హైవే పెట్రోలింగ్‌ పోలీస్‌ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానికుల వాహనాలకు చెందిన ప్లగ్‌లు తొలగించడంతో వారంతా ఎదురుతిరిగారు. తామంతా సహాయ చర్యలు చేపడుతుండగా, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది ఇలా వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top