వివాహేతర ‘బంధం’ పైచేయి సాధించింది.. | Child Death Case Reveals In Anantapur | Sakshi
Sakshi News home page

నిద్రలోనే నూరేళ్లు!

Nov 3 2018 11:53 AM | Updated on Nov 3 2018 11:53 AM

Child Death Case Reveals In Anantapur - Sakshi

రోదిస్తున్న బంధువులు (ఇన్‌సెట్‌లో) వెలికి తీసిన చిన్నారుల మృతదేహాలు

పిల్లలు దేవుళ్లంటాం బోసి నవ్వుల బుజ్జాయిలంటాంబుగ్గన చుక్క.. నుదుటన తిలకం  గాజు బొమ్మల్లా.. కదిలే ‘మట్టి’ ముద్దల్లా..  గుమ్మం ముందు బుడిబుడి నడకలు  ఘల్లు ఘల్లుమంటూ గజ్జెల సవ్వడి..  
మురిసిపోతాం.. మైమరిచిపోతాం..కను‘పాప’లని.. ఇంటి వెలుగులనిమా ఇంట మహాలక్ష్మిలని ఎన్నో పేర్లు..అల్లారు ముద్దుగా అమ్మ ‘ఒడి’లో పెరగాల్సిన పసి మొగ్గలు ..అభం శుభం తెలియని ఆ ‘చిరు’దీపాలను ఓ మృగం చిదిమేసింది.‘బంధం’ చిన్నబోయింది..వివాహేతర ‘బంధం’ పైచేయి సాధించింది..చీకటి సుఖం పసిమొగ్గలను పొట్టన పెట్టుకుంది.. గొంతు నులిమాడో తెలియదు..ముక్కు మూశాడో కనలేదు..అమ్మా అనే అరుపు వినిపించనేలేదు..పక్కనే ఉన్న కన్నపేగుకూ కనికరం లేకపోయింది..మూసిన కళ్లు తెరవకనే  బోసినవ్వులకు నూరేళ్లు నిండాయి.

అనంతపురం, పుట్టపర్తి టౌన్‌ : వివాహేతర సంబంధానికి అడ్డు ఉన్నారని ఇద్దరు చిన్నారులను కడతేర్చిన నిందితుడి వాంగ్మూలం మేరకు పూడ్చిపెట్టిన మృతదేహాలను శుక్రవారం వెలికి తీశారు. పుట్టపర్తి అర్బన్‌ సీఐ ఆంజనేయులు, తహసీల్దార్‌ సత్యనారాయణ, డాక్టర్‌ లోహిల్‌ సుకన్య సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం వారు మీడియాకు వివరాలు వెల్లడించారు. పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లికి చెందిన హరిజన ఓబుళేసు బెంగుళూరు నగర పాలక సంస్థలో చెత్త తరలించే వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి అక్కడి బాట్రాయినపురకు చెందిన గణేష్‌ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో తమ బంధాన్ని శాశ్వతంగా కొనసాగిద్దామని గత నెలలో తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు.

అయితే ఓబులేసు భార్య ఇందుకు అడ్డు చెప్పడంతో గొడవ జరిగింది. దీంతో గత నెల 23న అక్కడి నుంచి నాగమ్మను, ఆమె ఇద్దరి చిన్నారులు (మూడేళ్ల వయసున్న దర్శిని, ఇంకా పేరు పెట్టని ఆరు నెలల పాప)ను పుట్టపర్తికి తీసుకొచ్చి లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని ఉంచాడు. అదే నెల 26వ తేదీ అర్ధరాత్రి నాగమ్మ కూతుళ్లను ఓబులేసు దారుణంగా చంపి.. హంద్రీనీవా కాలువ సమీపంలో పాతిపెట్టాడు. అనంతరం తనకేమీ తెలియనట్టుగా వ్యవహరించాడు. పిల్లలు కనిపించకపోవడంతో నాగమ్మ తన బంధువులతో కలిసి పుట్టపర్తి అర్బన్‌ పోలీస్టేషన్‌లో ప్రియునిపై సీఐ ఆంజనేయులుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు ఓబులేసును అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. తానే చిన్నారులను చంపేశానని, హంద్రీనీవా సమీపంలో పూడ్చిపెట్టానని అంగీకరించాడు. శుక్రవారం సీఐ, తహసీల్దార్‌ల ఆధ్వర్యంలో నిందితుడి చూపిన ప్రదేశంలో పూడ్చిన మృతదేహాలను వెలికితీసి డాక్టర్‌ సమక్షంలో పంచనామా చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. అభం శుభం ఎరుగని చిన్నారుల మృతదేహాలను చూసి తండ్రి, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement