మెడికల్‌ సీట్ల పేరుతో మోసం

Cheating Case File on Lecturer in Medical Seats Scam - Sakshi

ఏవీఆర్‌ ఇనిస్టిట్యూట్‌ పేరుతో విద్యార్థులకు కోచింగ్‌

సీటు రాకపోతే బీ, సీ కేటగిరిలో కేటాయిస్తానంటూ రూ. లక్షల్లో వసూలు

నిందితుడి అరెస్ట్‌ రూ.9.45 లక్షల నగదు, కారు స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పి ర్యాంక్‌లు వచ్చేలా చూడాల్సిన లెక్చరరే మెడికల్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లు ఇప్పిస్తానంటూ రూ. లక్షల్లో దండుకుని తీసుకొని మోసగించడంతో రాచకొండ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.  అతడికి సహకరిస్తున్న నిర్మల్‌కు చెందిన యాగ శ్రావణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.9.45 లక్షల నగదు, వెంటో వోక్స్‌వాగన్‌కారును స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కృష్ణా జిల్లా, విసన్నపేట మండలం, పుతిరాల గ్రామానికి చెందిన అరిగే వెంకట్రామయ్య ఫిజిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాడు. అనంతరం నారాయణ కాలేజీలో లెక్చరర్‌గా పని చేశాడు. కొన్ని నెలల క్రితం తానే ఎల్‌బీనగర్‌లో ఏవీఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నీట్‌ స్టూడెంట్స్‌ పేరుతో ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించాడు. అందరూ విద్యార్థులకు సీట్లు వచ్చేలా చూస్తామని, ఒకవేళ రాకున్నా మేనేజ్‌మెంట్‌ కోటాలో బీ లేదా సీ కేటగిరిలో సీట్లు ఇప్పిస్తానంటూ ఆశ చూపాడు.

ఇలా పలువురు విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. తల్లిదండ్రులకు కూడా హామీ ఇవ్వడంతో నమ్మి చాలా మంది డబ్బులు చెల్లించారు. అయితే అనుకున్న స్థాయిలో ర్యాంకులు రాని విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ సీట్ల విషయాన్ని ప్రస్తావిస్తే రేపుమాపు అంటూ వాయిదా వేస్తున్నాడు. అతడి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఎల్‌బీనగర్‌కు చెందిన గదగోజు పరమేశ్‌ తన నుంచి రూ.17 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకొని సీట్లు ఇప్పించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ బృందం వెంకట్రామయ్య, అతని ఇనిస్టిట్యూట్‌లోని రిసెప్షనిస్ట్‌గా పనిచేసే శ్రావణి కదలికలపై నిఘా ఏర్పాటు చేసి ఎల్‌బీనగర్‌లో సోమవారం అరెస్టు చేశారు. నరేశ్, వంశీ, సత్యనారాయణల అనే మరి కొందరి నుంచి రూ. 1.40 కోట్లు తీసుకొని మోసం చేసినట్లు తేలింది. తదుపరి విచారణ కోసం నిందితులను ఎల్‌బీనగర్‌ పోలీసులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top