హడలెత్తించిన చైన్‌ స్నాచర్లు

Chain Snatching In Ichapuram - Sakshi

మహిళలపై విరుచుకుపడ్డ గొలుసు దుండగులు

ఒకే రోజు మూడు సంఘటనలు

శ్రీకాకుళం : జిల్లాలో చైన్‌స్నాచర్ల ఆగడాలు పెరుగుతున్నాయి. ఒంటరిగా వెళుతున్న మహిళలే లక్ష్యంగా దాడులు చేసి వారి వద్ద గల బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నారు. పథకం ప్రకారం ద్విచక్రవాహనాలపై వచ్చి.. దొంగతనాలు చేస్తున్నారు. శుక్రవారం జిల్లాలో మూడు చోట్ల పట్టపగలే ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇచ్ఛాపురం: పట్టపగలే మహిళమెడలో బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన ఘటన కలకలం రేపింది.

పట్టణంలో బాసుదేవపేటలో విశ్రాంత ఉపాధ్యాయుడు  కొణతాల మోహన్‌రావు, భార్య జానకి నివసిస్తున్నారు. ఆమె శుక్రవారం ఉదయం 5 గంటలకు ఇంటి వద్ద పూలు కోస్తుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. ఒకరు వాహనం దిగి వెనుక నుంచి వచ్చి మెడలోని 2 తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు.

ఈ ఘటనలో పుస్తెల తాడు తెగిపోవడంతో అందులోని పుస్తెలు, పూసలు కిందపడిపోయాయి. వెంటనే జానకి గట్టిగా అరవడంతో భర్త, కుమారుడు బయటకి వచ్చారు. వారిని వెంబడించే సరికి దుండగులు ద్విచక్రవాహనంపై వేగంగా పారిపోయారని భర్త మోహన్‌రావు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బి.మంగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

15 నిమిషాల వ్యవధిలో ఇద్దరిపై దాడి

కాశీబుగ్గ: 15 నిమిషాల వ్యవధిలో ఇద్దరు మహిళలపై పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో దుండగులు దాడిచేసి మూడు తులాల బంగారు తాడును లాక్కెళ్లిపోయారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం జరిగింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు జామియా మసీదుకు చెందిన రాజేశ్వరి శుక్రవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నారు.  వెనుక నుంచి వచ్చిన ఇద్దరు దొంగలు పథకం ప్రకారం.. 3 తులాల బంగారు గొలుసును దొంగిలించేందుకు ప్రయత్నించాడు.

ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో  నెట్టేసి పారిపోయారు. ఈ దృశ్యాలు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ చైర్మన్‌ కోత పూర్ణచంద్రరావు ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.  ఇది మరో ఘటనలో 15 నిమిషాల వ్యవధిలో మధ్యాహ్నం భోజనం తీసుకుని వస్తున్న ఉషారాణిపై దాడిచేసి 3 తులాల బంగారు తాడును దొంగిలించుకుపోయారు. ఆమె విలపిస్తు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.  పలాస–కాశీబుగ్గలో ఇంతవరకు సుమారుగా నాలుగేళ్లలో 30 గొలుసు దొంగతనాలు జరిగాయి.  

జిల్లా యంత్రాంగంపై ఎస్పీ ఆగ్రహం

జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ అధికారులపై మండిపడ్డారని విశ్వసనీయ సమాచారం. తరచూ గొలుసు దొంగతనాలు జరుగుతున్నా వాటిని అదుపు చేయకపోవడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలో అత్యధికంగా పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురంలో జరుగుతున్నాయని నిందితులను పట్టుకోవాలని అదేశాలు జారీచేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top