స్నాచింగ్‌ల కలకలం

Chain Snatchers Hulchul In Visakhapatnam - Sakshi

గంట వ్యవధిలోనే నగరంలోని నాలుగు చోట్ల చైన్లు తెంపుకుపోయిన దుండగులు

ఒంటరి మహిళలే లక్ష్యంగా బైక్‌పై దూసుకొచ్చి 16 తులాల ఆభరణాలు చోరీ

ఈ పరిణామంతో బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్న నగర మహిళలు

సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ)/విశాఖ క్రైం: నగరంలో చైన్‌స్నాచర్లు హడలెత్తించారు. గురువారం ఒక్క రోజే ఓ గంట వ్యవధిలోనే నాలుగు చోట్ల మహిళల మెడలోని బంగారు ఆభరణాలు తెంపుకుని ఉడాయించారు. బుచ్చిరాజుపాలెం సుసర్లకాలనీ, శాంతినగర్, మర్రిపాలెం ఉడా లే అవుట్, బాలయ్య శాస్త్రి లే అవుట్‌లో నలుగురు మహిళల మెడలోని 16తులాల బరువు గల చైన్లు లాక్కుని పారిపోయారు. ఒక బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చి తెంపుకు పోయారని బాధితులంతా చెబుతుండడంతో... ఈ చోరీలన్నీ ఆ ఇద్దరే చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల చిత్రాలు విడుదల చేశారు. ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు. చైన్‌స్నాచర్లకు భయపడి బయటకు రావాలంటేనే మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. చైన్‌స్నాచింగ్‌లు జరిగా యని తెలుసుకున్న ఎయిర్‌పోర్ట్‌ నేర విభాగ పోలీసులు ఘట నా స్థలాలకు చేరుకుని వివరాలు సేకరించారు. సీఐ సాయి, ఎస్‌ఐలు కుమార్, మన్మథరావు, ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ మళ్ల శేషు, ఎస్‌ఐలు నర్శింగరావు, సురేష్, నాగేశ్వరరావు,  జీడీ బాబు వివరాలు సేకరించారు.

మహిళలు అప్రమత్తంగా ఉండాలి
నగరంలోని పలు ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు వస్తువులను దుండగులు తెంపుకుపోయిన నేపథ్యంలో మహిళలంతా అప్రమత్తంగా ఉండాలని నగర ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌ దాడి నాగేంద్రకుమార గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ద్విచక్ర వాహనంపై నీలం రంగు, నలుపు రంగు షర్టులు, జీన్‌ ఫ్యాంట్లు వేసుకుని, తలకు హెల్మెట్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. అనుమానితులు కనిపిస్తే డయల్‌ 100, 1090 నంబర్‌కు, 9490624787, 0891–2565454, 0891 2704465 నంబర్లకు సమాచారమివ్వాలని కోరారు. వివరాలు తెలిపిన వారికి తగిన పారితోషకం ఇస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

సమయం గురువారం ఉదయం 7:45 గంటలు
ఎన్‌ఏడీ కూడలి బుచ్చిరాజుపాలెం సుసర్ల కాలనీ 80 అడుగుల రహదారి ప్రశాంతంగా ఉంది. అదే రహదారిలోని మైత్రి అపార్టుమెంట్‌లో నివాసముంటున్న మంగయ్యమ్మ(60) పాల ప్యాకెట్ల కోసం రోడ్డుపైకి వచ్చింది. సమీపంలోని దుకాణంలో ప్యాకెట్లు తీసుకుని తిరిగి ఇంటిముఖం పట్టిన ఆమెను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అనుసరించారు. ఆమె వారిని చూసేలోపే ఒక్కసారిగా మెడలోని పుస్తెల తాడు తెంపుకుని ఉడాయించారు. వెంటనే తేరుకున్న బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. చోరీకి గురైన తాడు విలువ రెండు తులాలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది

సమయం గురువారం ఉదయం 8:10 గంటలు
ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శాంతినగర్‌లో నివాసముంటున్న నిర్మలా కుమారి నారాయణ పాఠశాలలో తెలుగు టీచర్‌గా పని చేస్తోంది. ఎప్పటిలాగే పాఠశాలకు గురువారం ఉదయం ఆమె బయలుదేరింది. మరికొద్ది సేపటిలో స్కూల్‌కు చేరుకుంటుందనగా... ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని రెండు తులాల తాడు తెంపుకుని పారిపోయారు. ఆ సమయంలో దొంగా... దొంగా... అని అరిచినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు యువకులు బైక్‌ ఉన్నారని తెలిపింది. జరిగిన ఘటనపై నిర్మలా కుమారి పోలీసులను ఆశ్రయించింది.

సమయం గురువారం ఉదయం 8:15 గంటలు
మర్రపాలెం ఉడా లే అవుట్‌లో నివాసముంటున్న హేమలత తన పిల్లలను స్కూల్‌లో దించేందుకు స్కూటీపై బయలుదేరింది. ఇంటి నుంచి ఉడా లే అవుట్‌ పార్క్‌ సమీపానికి వచ్చేసరికి... వెనుక నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని పుస్తెలతాడు, నల్లపూసలు దండ, చైన్‌ తెంచకుని పారిపోయారు. ఈ హఠాత్‌ పరిణామంతో హేమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. రోడ్డుపైకి రాగానే ఇద్దరు వ్యక్తులు తనను కొంతదూరం అనుసరించారని, ఇలా చైన్‌స్నాచింగ్‌కు పాల్పడతారని తాను ఊహించలేదని ఆమె వాపోయింది. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సమయం గురువారం ఉదయం 8:30 గంటలు
నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బాలయ్య శాస్త్రి లే అవుట్‌లోని రాధాకృష్ణ లే అవుట్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న వై.వెంకటలక్ష్మి(58) గురువారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి పాలు కోసం దుకాణానికి బయలుదేరింది. ఆమె రోడ్డుపైకి వచ్చిన కొద్ది సేపటికే ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి మెడలోని పుస్తెలతాడుతోపాటు మరో చైన్‌ తెంపుకుపోయారు. దీంతో లబోదిబోమంటూ వెంకటలక్ష్మి నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు క్రైం ఎస్‌ఐ వెంకటరావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top