క్యాట్‌ఫిష్‌ అక్రమ రవాణా!

Catfish smuggling! - Sakshi

కర్ణాటక నుంచి కామారెడ్డి మీదుగా ఉత్తర భారతానికి..  

వాహనాల తనిఖీలో వెలుగు చూసిన దందా 

సాక్షి, కామారెడ్డి: ఆఫ్రికన్‌ క్యాట్‌ఫిష్‌ అక్రమ దందా కొనసాగుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి ప్రాంతం నుంచి 44వ నంబర్‌ జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ తదితర ప్రాంతాలకు పెద్ద ఎత్తున రవాణా అవుతోంది. సోమవారం జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో క్యాట్‌ఫిష్‌ అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసింది. చింతామణి ప్రాంతంలో ఆఫ్రికన్‌ క్యాట్‌ఫిష్‌ పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి లారీల్లో బెంగళూరు–నాగ్‌పూర్‌ జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాలకు తరలిస్తున్నారని సమాచారం.

ఈనెల 19న లారీలో క్యాట్‌ఫిష్‌ తరలిస్తున్న ముఠా.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో లారీలో నీటిని నింపుకోవడానికి యత్నించింది. ఈ సందర్భంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానం వచ్చి లారీపై కప్పిన కవర్‌ను విప్పి చూశారు. అవి ఆఫ్రికన్‌ క్యాట్‌ఫిష్‌ అని తేలింది. దీంతో మత్స్యశాఖ అధికారులు జేసీబీని తెప్పించి పెద్ద గుంతను తవ్వి లారీలో ఉన్న దాదాపు నాలుగు టన్నుల క్యాట్‌ఫిష్‌ను పారబోయించి పూడ్చి వేశారు. వీటి విలువ రూ. 2 లక్షలపైనే ఉంటుందని అంచనా. 

‘క్యాట్‌ఫిష్‌’ వెనుక మాఫియా 
క్యాట్‌ఫిష్‌ ఉత్పత్తి, పెంపకం, రవాణా, అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఫిష్‌ను తింటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వాటిపై నిషేధం విధించిందని మత్స్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ అక్రమార్కులు తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. క్యాట్‌ఫిష్‌ అక్రమ రవాణా వెనుక పెద్ద మాఫియా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా క్యాట్‌ఫిష్‌ను స్వాధీనం చేసుకుని పూడ్చివేయించిన పోలీసులు.. డ్రైవర్‌ మీద మాత్రమే కేసు నమోదు చేశారు.

క్యాట్‌ఫిష్‌ రవాణా నేరం
క్యాట్‌ఫిష్‌ వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. క్యాట్‌ఫిష్‌ను పెంచినా, అమ్మినా, రవాణా చేసినా చర్యలు తప్పవు. జాతీయ రహదారిపై పోలీసులు లారీని పట్టుకుని మాకు సమాచారం ఇవ్వడంతో వెళ్లి పరిశీలించాం. అవి క్యాట్‌ఫిష్‌ అని తేలడంతో వాటిని గుంతలో వేసి, పూడ్చి వేయించాం. 
–పూర్ణిమ, జిల్లా మత్స్యశాఖ అధికారి, కామారెడ్డి 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top