నేరాలకు అడ్డాగా రాజధాని 

Capital Amaravati Became as Crimes Adda - Sakshi

అదుపుతప్పిన శాంతిభద్రతలు 

సీఎం ఇంటి వెనక నుంచే ఇసుక అక్రమ రవాణా.. ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు 

రెండు నెలల వ్యవధిలో ముగ్గురి హత్య 

జ్యోతి హత్య కేసులో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు 

అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పోలీసులు 

సాక్షి, అమరావతి బ్యూరో: యానిమేషన్‌ వీడియోలు, డిజైన్ల పేరిట అబ్బురపరిచే సెట్టింగులు, మాటల గారడీలు, సింగపూర్, జపాన్‌ దేశాల పర్యటనలు... ఇవీ నాలుగున్నరేళ్లుగా రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు మనకు చూపించిన సినిమా. క్షేత్రస్థాయిలో మాత్రం అంతా మిథ్యే అన్న వాస్తవం అందరికీ తెలిసిందే. రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా పక్కనపెట్టేసిన ప్రభుత్వం అక్కడ శాంతిభద్రతల పరిరక్షణను కూడా గాలికొదిలేసింది. అమరావతి ప్రాంతంలో గతంలో ఎప్పుడూ లేనంతగా శాంతిభద్రతలు క్షీణించాయి. సామాన్య ప్రజలకు రక్షణ కరువవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు.  

సీఎం ఇంటి వెనుకే ఇసుక అక్రమ దందా 
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వెనకవైపు నుంచే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. రాజధాని అవసరాల కోసమని చెబుతూ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. పెనుమాక ఇసుక రీచ్‌ నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోందని.. ఇది ఇలాగే కొనసాగితే విజయవాడ ప్రాంతం పర్యావరణ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పర్యావరణ వేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)కి ఫిర్యాదు చేశారు. ఇసుక అక్రమ తవ్వకాల్ని పరిశీలించి, చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర కాలుష్య మండలిని ఎన్జీటీ ఆదేశించింది. నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు సంబంధిత అధికారులు అటువైపు కూడా తొంగిచూడలేదు. 

రెండు నెలల్లో ముగ్గురు హత్య 
గత రెండు నెలల్లో రాజధాని పరిధిలోని తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ముగ్గురు హత్యకు గురికాగా, పోలీసుల వేధింపులు భరించలేక ఒక యువజంట ఆత్మహత్య చేసుకుంది. గతేడాది డిసెంబర్‌ 22న మంగళగిరి మండలంలోని కురగల్లుకు రోడ్డు నిర్మాణ పనుల కోసం రంగారెడ్డి జిల్లా నుంచి తండ్రీకొడుకులు వచ్చారు. వారిని జార్ఖండ్‌కు చెందిన డ్రైవర్‌ మరో ఇద్దరి సహాయంతో కిరాతకంగా హత్య చేశారు. రెండ్రోజుల అనంతరం మృతుల బంధువుల ఫిర్యాదుతో పోలీసు యంత్రాంగం స్పందించి హత్య కేసును ఛేదించారు.  డీజీపీ ఆఫీసుకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న నవులూరులో ఈ నెల 11న జ్యోతి అనే యువతి దారుణ హత్యకు గురైంది. దాడిలో ఆమె ప్రేమికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ హత్య కేసులో పోలీసుల విచారణ తీవ్ర సందేహాస్పదంగా మారింది. కేసును నిష్పక్షపాతంగా విచారించాల్సిన పోలీసులు దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారని, ప్రేమికుడే హత్య చేశాడని జ్యోతి బంధువుల ఆరోపణతో మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు.  

పోలీసుల వేధింపులకు దంపతుల ఆత్మహత్య  
మంగళగిరి మండలం నవులూరుకు చెందిన మిరియాల వెంకటకిరణ్, అతని భార్య హెలీనా పోలీసుల వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. వెంకటకిరణ్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేయడంతో పాటు.. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఎస్సై సత్యనారాయణ వేధింపులకు పాల్పడడంతో దంపతులు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో దళిత సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. 

భూములు తగులబెట్టిన కేసు క్లోజ్‌..! 
రాజధానిగా అమరావతిని ప్రకటించిన అనంతరం 2014 డిసెంబర్‌ 29న రాజధాని గ్రామాలైన ఉండవల్లి, ఉద్దండ్రాయునిపాలెం, మందడం, వెంకటపాలెం గ్రామాల్లో అర్ధరాత్రి ఆగంతకులు అలజడి సృష్టించారు. పంట పొలాలకు నిప్పు పెట్టారు. పెనుసంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రధాన నిందితుల్ని ఇంతవరకూ పట్టుకోలేదు. నాలుగేళ్లపాటు దర్యాప్తు చేసిన గుంటూరు రూరల్‌ పోలీసులు నిస్సహాయత వ్యక్తం చేస్తూ గతేడాది అక్టోబర్‌లో కేసు క్లోజ్‌ చేశారు. మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో సుమారు 300 మంది అమాయక రైతుల్ని దర్యాప్తు పేరిట చిత్రహింసలకు గురిచేసి చివరికి కేసును మూసేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.  

అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారు 
అధికార పార్టీ నాయకులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఎన్ని విమర్శలు వచ్చినా పోలీసుల తీరు మారడం లేదు. టీడీపీ నాయకులకు సహకరిస్తూ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రేమ జంటపై దాడి కేసు దర్యాప్తు నుంచి గుంటూరు నార్త్‌ జోన్‌ డీఎస్పీ రామకృష్ణను ఉన్నతాధికారులు తప్పించారు. ఆయనపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. మంత్రి లోకేశ్‌కు దగ్గరగా ఉండే ఓ వ్యక్తికి బంధువు కావడంతో... యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే మంగళగిరి రూరల్‌ సీఐ బాలాజీని సస్పెండ్‌ చేశారు. ఎస్‌ఐ బాబురావును వీఆర్‌కు పంపడంతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. వరుసగా వేటు పడుతున్నా పోలీసులు తమ తీరును మార్చుకోవడం లేదని రాజధాని ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top