లక్నో కేంద్రంగా కాల్‌ రూటింగ్‌! | Call Routes From Lakno UP ATS Team Reveals | Sakshi
Sakshi News home page

లక్నో కేంద్రంగా కాల్‌ రూటింగ్‌!

Feb 4 2019 11:19 AM | Updated on Feb 4 2019 11:19 AM

Call Routes From Lakno UP ATS Team Reveals - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: హైటెక్‌ పద్దతిలో ఇంటర్నేషనల్‌ కాల్స్‌ను వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రోటోకాల్‌ (వీఓఐపీ) పద్దతిలో లోకల్‌ కాల్స్‌గా మార్చే కాల్‌ రూటింగ్‌ ఎక్స్‌ఛేంజ్‌ దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నట్లు ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రసిస్ట్‌ స్క్వాడ్‌ (యూపీ ఏటీఎస్‌) అధికారులు గుర్తించారు. ఇటీవల అక్కడి లాల్‌బాగ్‌ ఏరియాలో దాడులు చేసి ఓ ఎంబీఏ విద్యార్థి సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి విచారణ నేపథ్యంలో ఈ ప్రధాన ఎక్స్‌ఛేంజ్‌కు హైదరాబాద్‌లోనూ ఓ బ్రాంచ్‌ ఉన్నట్లు తేలింది. ఆ వివరాలు సేకరించిన ఏటీఎస్‌ ఇక్కడి వారిని పట్టుకునేందుకు త్వరలో ఓ ప్రత్యేక బృందాన్ని సిటీకి పంపనుంది. విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్‌ కాల్‌ అక్కడి ఎక్స్‌ఛేంజి నుంచి నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడి నుంచి ఇంటర్నేషనల్‌ గేట్‌ వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడి నుంచి ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ లేదా శాటిలైట్‌ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇక్కడికి చేరిన ఫోన్‌కాల్‌ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్, బీఎస్‌ఓ టెలిఫోన్‌ ఎక్సేంజ్‌ల ద్వారా కాల్‌ రిసీవ్‌ చేసుకునే ఫోన్‌కు వస్తుంది.

ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్, బీఎస్‌ఓ టెలిఫోన్‌ ఎక్సేంజ్‌లకు సైతం విదేశీ కాల్‌ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు.  ఈ మొత్తం చెల్లించకుండా తప్పించుకునేందుకు అక్కడి కాల్‌ ఆపరేటర్లే ఇక్కడ వ్యవస్థీకృత ముఠాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దేశం నుంచి ఓ కాల్‌ విదేశాలకు వెళ్లాలంటే (ఔట్‌ గోయింగ్‌) కచ్చితంగా అది సర్వీస్‌ ప్రొవైడర్‌ ద్వారానే జరగాలి. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఫోన్‌ కాల్‌ పైనా ఏజెన్సీల నిఘా ఉంటుంది. అనుమానాస్పద దేశాలు, వ్యక్తులు, నంబర్ల నుంచి వచ్చే వాటిని ట్యాప్‌ కూడా చేస్తారు. ఇందుకు ఉపకరించే సాధనాలు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఐఎల్‌డీ ఆపరేటర్లకు ఉంటాయి. వారికి చిక్కకుండా హైటెక్‌ పద్దతిలో ఇంటర్నేషనల్‌ కాల్స్‌ను వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రోటోకాల్‌ పద్దతిలో లోకల్‌ కాల్స్‌గా మారుస్తుంటారు. విదేశీ ఆపరేటర్లు ఇక్కడి ఏజెన్సీలకు డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించే విధంగా ఓ విధానాన్ని రూపొందించారు.

ఇక్కడ ఉంటున్న కొందరితో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తారు. ఆ తర్వాత విదేశంలో ఉన్న ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చిన ఫోన్‌ కాల్‌ అక్కడ డేటాగా మారిపోతుంది. దానిని ఇంటర్‌నెట్‌ ద్వారా నేరుగా ఇక్కడ ఏర్పాటు చేయించిన అత్యాధునిక పరికరాలకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండే గేట్‌వేలు ఈ డేటాను మళ్లీ కాల్‌గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్‌ఏ ఎఫ్‌డబ్ల్యూటీలకు చేరుతుంది. స్థానికంగా (లోకల్‌) బోగస్‌ వివరాలతో తీసుకున్న ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌కార్డులను సేకరించి ఈ సీడీఎమ్‌ఏ ఎఫ్‌డబ్ల్యూటీలను తయారు చేస్తారు. గేట్‌వే నుంచి వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్‌ లోకల్‌గా మారిపోయి ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌కార్డునకు చెందిన నెంబరు (లోకల్‌) నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్‌ అందుకునే వారికి కనిపిస్తుంది.

దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి సైతం కాల్‌చార్జ్‌ తగ్గుతుంది. ఇలాంటి గ్యాంగుల్లో మహారాష్ట్రకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ సచిన్‌రాజ్‌ ఇస్సాక్, లక్నో, వారణాసిలకు చెందిన డిగ్రీ విద్యార్థులు చంచల్‌ మిశ్రా, సుజీత్‌ సింగ్‌ కీలక పాత్రధారులుగా ఉన్నారు. వీరు హైదరాబాద్‌తో పాటు వారణాసి, ముంబై, చెన్నైల్లో కొందరి సహకారంతో బ్రాంచ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడిక్కడ స్థానికులకు వీటి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఈ రూటింగ్‌ వల్ల దేశంలోని ఆపరేటర్ల ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్నులకు గండిపడుతోంది.  ఇందుకు సహకరించిన స్థానికులకు హవాలా రూపంలో కమీషన్‌ పంపిస్తుంది. ఈ గ్యాంగ్‌ చెన్నై, నేపాల్‌ ఫిలిప్పీన్స్, శ్రీలంకల్లోనూ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకుంది. వీరి వ్యవహారాలను గుర్తించిన యూపీ ఏటీఎస్‌ గురువారం సచిన్, చంచల్, సుజిత్‌లను పట్టుకుంది. సాధారణంగా ఈ తరహా కాల్స్‌ను ఎక్కువగా ఉగ్రవాదులు, అసాంఘికశక్తులు వాడుకుంటారు. యూపీలోని అనేక ప్రాంతాలు వీటికి అడ్డాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యవస్థీకృతంగా సాగుతున్న రూటింగ్‌ వ్యవహారాన్ని వారు సీరియస్‌గా తీసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఏజెంట్లపై దాడులు చేయడానికి ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement