నవ వధువు బలవన్మరణం

Bride Commits Suicide Over Dowry Harassment - Sakshi

అదనపు కట్నం కోసం వేధింపులు  

శోకసంద్రంలో కుటుంబం

పోలీసుల అదుపులో భర్త  

ఎన్నో ఆశలతో మెట్టినింటిలో అడుగుపెట్టింది.. నాటి నుంచి అదనపుకట్నం అత్త మామలు వేధించసాగారు. జీవితాంతం బాసటగా నిలుస్తానన్న భర్త కూడా తల్లిదండ్రులకు వంతపాడాడు. వారి వేధింపులు తాళలేక ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన నగరంలోని జాకీర్‌హుస్సేన్‌నగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది.

నెల్లూరు(క్రైమ్‌): నగరంలో జాకీర్‌హుస్సేన్‌ నగర్‌లోని వాటర్‌ట్యాంక్‌ సమీపంలో నివశిస్తున్న షేక్‌ సాబ్‌జాన్, మస్తాన్‌బీ దంపతుల కుమార్తె సిరాజున్నీసా(25). బీటెక్‌ పూర్తిచేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఆమెకు వైఎస్‌ఆర్‌ కడప జిల్లా బద్వేలు మండలం అశోక్‌నగర్‌కు చెందిన ఇస్మాయిల్, హసీనా దంపతుల కుమారుడు నవాజ్‌ అలీతో వివాహమైంది. వివాహ సమయంలో సిరాజున్నీసా కుటుంబసభ్యులు కట్నం కింద రూ.6లక్షల నగదు, 40సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చారు. మెట్టినింటిలో సిరాజున్నీసా సంతోషం ఎంతో కాలం నిలువలేదు. అత్త, మామలు అదనపు కట్నం కోసం ఆమెను వేధించడం ప్రారంభించారు. రూ.10లక్షలు ఇస్తే కాపురం చేయమని లేదంటే మరొకరికి ఇచ్చి కుమారుడికి వివాహం చేస్తామని ఆమెను బెదిరించడం ప్రారంభించారు. భర్త కూడా తన తల్లిదండ్రులకు ఒత్తాసు పలికాడు. దీంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి కన్నీటి పర్యంతమైంది. వారు సర్దుకుపోమని చెప్పారు. దీంతో ఆమె ఎప్పటికైనా అత్తింటివారు మారకపోతారా అని వారి వేధింపులను భరిస్తూ వచ్చింది. అయినా వారి ప్రవర్తనలో మార్పురాలేదు. అత్తమామలు, భర్త ఆమెను సూటిపోటి మాటలతో వేధించసాగారు.

ఈ నేపథ్యంలో 15రోజుల కిందట సిరాజున్నీసా పిన్ని బద్వేలుకు వెళ్లి ఆమెను తన వెంట నెల్లూరుకు తీసుకొచ్చింది.  అప్పటి నుంచి బాధితురాలు తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. శనివారం నవాజ్‌అలీ వారికి ఫోన్‌ చేశాడు. తాము అడిగినంత తీసుకొని కాపురానికి రావాలనీ లేదంటే  నీ వస్తువులు  తీసుకొని వెళ్లిపోవాలని చెప్పాడు. దీంతో బాధితురాలు తన తండ్రికి విషయాన్ని చెప్పింది. ఆయన సోమవారం తానే స్వయంగా వచ్చి మాట్లాడుతానని నవాజ్‌ అలీ కుటుంబభ్యులకు చెప్పాడు. శనివారం రాత్రి మళ్లీ సిరాజున్నీసాకు ఫోన్‌చేసి రూ.20వేలు కావాలని నవాజ్‌ అలీ అడిగాడు. కొద్దిసేపు ఆమెతో మాట్లాడాడు. అనంతరం ఏం జరిగిందో తెలియదు కాని ఆదివారం తెల్లవారుజామున ఆమె తన ఇంట్లోని దూలానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఉదయం ఆమె కుటుంబసభ్యులు పడకగదిలోకి వెళ్లిచూడగా సిరాజున్నీసా వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందకుదించారు. అప్పటికే మృతిచెంది ఉండటంతో బోరున విలపించారు. సిరాజున్నీసా మృతి విషయాన్ని అత్తింటివారికి తెలియజేశారు. సాయంత్రం రెండోనగర పోలీసులకు సమాచారం అందడంతో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, రెండోనగర ఇన్‌స్పెక్టర్‌ వెంకటరావు, ఎస్‌ఐ వి.శ్రీహరిబాబులు ఘటనా స్థలానికి చేరుకుని.. ఆత్మహత్యకు గల కారణాలను బాధిత కుటంబసభ్యులను అడిగి తెలుసుకొన్నారు. రెవెన్యూ అధికారుల శవ పంచనామా నిర్వహించారు. ఈ క్రమంలో మృతురాలి భర్త అక్కడికి రావడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని స్టేసన్‌కు తరలించారు. డీఎస్పీ కేసు విచారిస్తున్నారు.

వేధింపులతోనే ఆత్మహత్య    
అత్తింటి వేధింపులతోనే సిరాజున్నీసా బలవన్మరణానికి పాల్పడిందని బాధిత కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వివాహ సమయంలో నవాజ్‌అలీ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని చెప్పారనీ, పెళ్లికార్డులు తయారుచేయించే సమయంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కాదన్న విషయం తమకు తెలిసిందన్నారు. ఈ విషయం వారిని ప్రశ్నించగా ఆ కంపెనీలో చేయడం ఇష్టంలేక ఇంటికి వచ్చి ఓ ప్రైవేట్‌ కళాశాలలో అధ్యాపకుడి చేస్తున్నట్లు చెప్పారని తెలిపారు. అయినప్పటికి కుమార్తె బాగుంటుందని వివాహం చేశామని, నాటినుంచే అదనపుకట్నం కోసం వేధించి బలితీసుకొన్నారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top