సూట్‌కేసులో కుక్కి.. కాలువలో పడేసి 

Boyfriend murdered his girlfriend - Sakshi

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

అబద్ధాలతో కథ నడిపి.. చివరికి అడ్డంగా దొరికిన వైనం

మృతురాలు టీసీఎస్‌ ఉద్యోగి 

హైదరాబాద్‌/రామచంద్రాపురం(పటాన్‌చెరు): అది సుభాష్‌నగర్‌ డివిజన్‌లోని సుందర్‌నగర్‌ కాలనీ. సమయం రాత్రి 10 గంటలు కావస్తోంది. మఫ్టీలో ఉన్న పోలీసులు ఓ వ్యక్తి చేతులకు సంకెళ్లు వేసి తీసుకువచ్చారు. అసలేమి జరుగుతుందో స్థానికులకు అర్థం కాని పరిస్థితి. సరిగ్గా అర్ధగంట వ్యవధిలో మురికి కాలువ నుంచి ఓ పెద్ద సూట్‌కేసును వెలికి తీయించారు. సంకెళ్లున్న వ్యక్తితో సూట్‌ కేసు తెరిపించగా అందులో ఓ యువతి శవం కనిపించింది. దీంతో అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. తనను పెళ్లి చేసుకోమని సదరు యువతి ఒత్తిడి చేయడంతో ప్రియుడే హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది.  

పెళ్లి ప్రస్తావనతోనే హత్య..: రామచంద్రాపురం పట్టణం ఎల్‌ఐజీ కాలనీలో నివాసం ఉండే లావణ్య (25) ఇంజనీరింగ్‌ పూర్తి చేసి.. హైదరాబాద్‌లోని టీసీఎస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. సుభాష్‌నగర్‌ డివిజన్‌ సుందర్‌నగర్‌ కాలనీకి చెందిన మనోజ్‌ కుమారుడైన సునీల్‌కుమార్‌ (26) జూబ్లీహిల్స్‌లోని మోల్డ్‌టెక్‌లో పనిచేస్తున్నాడు. ఇంజనీరింగ్‌ చదువుతున్న సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. 2017లో సునీల్‌కుమార్‌ తాను ప్రేమిస్తున్నానని లావణ్యకు తెలిపాడు. దాన్ని లావణ్య అంగీకరించింది.

అనంతరం వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. లావణ్య తనను పెళ్లి చేసుకోవాలని సునీల్‌పై ఒత్తిడి పెంచింది. ఆ సందర్భంలో సునీల్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎంగేజ్‌మెంట్‌ కూడా జరుపుకునేందుకు నిర్ణయించాడు. అనంతరం తన తల్లిదండ్రులకు ప్రమాదం జరిగిందని సాకులు చెప్పి ఎంగేజ్‌మెంట్‌ రద్దు చేశాడు. ఈ నెల 4న లావణ్య ఇంటికి వచ్చిన సునీల్‌ తనకు మస్కట్‌లో ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. నీకు కూడా అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలో లావణ్యను తీసుకొని శంషాబాద్‌లోని ఓ లాడ్జిలో దిగాడు. ఈ నెల 5న లావణ్యను హత్యచేసి ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టుకొని కుత్బుల్లాపూర్‌ పరిధిలోని సూరారం కాలనీలోని డ్రైనేజీలో పడేశాడు. 

లావణ్య తల్లిదండ్రులకు అనుమానం రాకుండా మృతురాలు లావణ్యకు చెందిన సెల్‌ఫోన్‌ నుంచి 5వ తేదీన మస్కట్‌ చేరుకున్నట్టు మెసేజ్‌ పెట్టాడు. తిరిగి 7వ తేదీన మస్కట్‌ నుంచి వస్తున్నట్లు మెసేజ్‌ చేశాడు. మియాపూర్‌ బస్సులో ఉన్నట్లు లొకేషన్‌ షేర్‌ చేసి మృతురాలి ఫోన్‌ నంబర్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. ఎంతకీ లావణ్య ఇంటికి రాకపోయేసరికి ఆమె కుటుంబ సభ్యులు తిరిగి సునీల్‌కు ఫోన్‌ చేశారు. తను మస్కట్‌ నుంచి బయల్దేరి వస్తున్నానని మృతురాలి తల్లిదండ్రులకు తెలిపాడు. వారు ఎయిర్‌ పోర్టుకు వస్తానని చెప్పడంతో రావద్దని వారించాడు. దాంతో అనుమానం వచ్చిన మృతురాలి కుటుంబ సభ్యులు వెళ్లి సునీల్‌ కోసం వేచి చూశారు.

అయితే లావణ్య కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి సునీల్‌ తనను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని చెప్పాడు. దానిపై అనుమానం వచ్చిన లావణ్య తల్లిదండ్రులు రామచంద్రాపురం పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. లావణ్య ఇచ్చిన తినుబండారాలు సునీల్‌ ఇంట్లో దొరకడంతో పోలీసులు విచారణ జరిపారు. పోలీసులు సునీల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. సూట్‌ కేసులో మృతదేహం ఉన్న ప్రాంతానికి శనివారం రాత్రి నిందితుడిని తీసుకొచ్చి వెలికి తీయించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top