అక్కడ దొంగతనం.. ఇక్కడ విక్రయం!

Bombay Salim Robbery Case Mystery Reveals - Sakshi

చోరీ సొత్తును నగరంలో అమ్ముతున్న బాంబే సలీం

రిసీవర్ల జాబితాలో అతడి స్నేహితులు, బంధువులు

ఐదుగురిని అరెస్టు చేసి తీసుకెళ్లిన పుణె పోలీసులు

ఇతడికి సహకరించినవారిలో ఓ పోలీసు కానిస్టేబుల్‌?

సాక్షి, సిటీబ్యూరో: సంపన్నుల ఇళ్లే అతడి టార్గెట్‌.. దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా దొంగతనాలు. 127 చోరీ కేసుల్లో పుణె క్రైమ్‌ బ్రాంచ్‌కు గత వారం చిక్కిన ‘దొంగలకే దొంగ’ మహ్మద్‌ హమీద్‌ ఖురేషీ అలియాస్‌ బాంబే సలీం విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇతడు దేశంలోని ఏ ప్రాంతంలో చోరీ చేసినా ఆ సొత్తును మాత్రం హైదరాబాద్‌కు తరలించి ఐదుగురు రిసీవర్ల ద్వారా విక్రయించేవాడని తేలింది. దీంతో మూడు రోజుల క్రితం సిటీకి వచ్చిన క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు సలీం బంధువులు, స్నేహితులుగా అనుమానిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. మరోపక్క ఇతగాడికి ముంబై పోలీసు విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్‌ సహకరిస్తున్నట్లు క్రైమ్‌ బ్రాంచ్‌ అనుమానిస్తోంది.

ఆ కోణంలో లోతుగా విచారించాలని నిర్ణయించింది. పుణె సహా ఇతర నగరాల్లో చేసిన 127 కేసులకు సంబంధించిన సొత్తును సలీం ఖరేషీ తన వెంట హైదరాబాద్‌కు తీసుకువచ్చాడని తేలింది. కారులో, విమానంలో తీసుకువస్తే తనిఖీల్లో దొరికే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో వాటిని వినియోగించడు. సాధారణ ప్రయాణికుడి మాదిరిగా రైలులో సిటీకి చేరుకుంటాడు. తొలుత ఈ సొత్తును మెహిదీపట్నం బృందావన్‌ కాలనీలోని తన ఇంటికి తరలించే సలీం.. ఆపై నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తన స్నేహితులైన షరీఫ్‌ షేక్, అశోక్‌ ప్రధాన్, అబ్దుల్‌ సత్తార్, మొఘల్‌ అన్వారీలాల్‌ బేగ్, ప్రభు నంజ్వాడేలకు ఇచ్చేవాడు. ఈ ఐదుగురు రిసీవర్లు ఆ సొత్తును అమ్మి క్యాష్‌ చేయగా.. తమ కమీషన్‌ మిగుల్చుకుని మిగిలిన మొత్తం సలీంకు అప్పగించేవాళ్లు. సలీం విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా గత వారం హైదరాబాద్‌కు వచ్చిన పుణె క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆ ఐదుగురు రిసీవర్లను పట్టుకుని తీసుకెళ్లారు. వీరి నుంచి రూ.36.91 లక్షల విలువైన 860 గ్రాముల బంగారం, 6.275 కేజీల వెండి తదితరాలను రికవరీ చేశారు.  

జైలుకెళ్లిన ప్రతిసారీ కొత్త గ్యాంగ్‌..
దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో వెయ్యి వరకు చోరీలు చేసిన బాంబే సలీం అత్యధిక నేరాలు ఒంటరిగానే చేశాడు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ముఠా కట్టి రంగంలోకి దిగుతాడు. ఏ సందర్భంలోనూ ఒకసారి వాడిన ముఠా సభ్యుల్ని మరోసారి వినియోగించడు. వీరి ద్వారా తమ  ఉనికి బయపడుతుందనే ఉద్దేశంలోనే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 2012లో సైబరాబాద్‌ పోలీసులకు చిక్కినప్పుడు బెంగళూరుకు చెందిన ఆసిఫ్‌తో కలిసి నేరాలు చేసినట్లు వెల్లడైంది. ఇతగాడిని 2017లో గుజరాత్‌లోని సూరత్‌ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడితో పాటు ముఠా కట్టిన రవీంద్ర ఎస్‌ థైడే, ప్రకాష్‌ బి సన్వానేలను పట్టుకున్నారు. ఆ దఫా ఈ త్రయం మొత్తం 200 చోరీలు చేసినట్లు తేల్చారు. ఆ ఏడాది మార్చ్‌ 11 రాత్రి సూరత్‌కు చెందిన వ్యాపారి విపుల్‌ రాశ్యా ఇంటిపై పంజా విసిరిన ఈ ముగ్గురూ భారీగా బంగారం, వజ్రాలతో పాటు ఆయన కారును తస్కరించారు. ఈ వాహనానికి జీపీఎస్‌ పరిజ్ఞానం ఉండటంతో ఆ విషయాన్ని యజమాని పోలీసులకు తెలిపాడు. దీని ద్వారా దర్యాప్తు చేసిన సూరత్‌ పోలీసులు ఖురేషీ ఆచూకీ హైదరాబాద్‌లో కనుగొని అదే నెల 16న అరెస్టు చేసి తీసుకువెళ్ళారు. ఇతడు ఇచ్చిన సమాచారంతో మిగిలిన ఇద్దరినీ పట్టుకుని కారు, సొత్తు రికవరీ చేశారు. తాజాగా పుణె క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఇషావర్‌తో కలిసి నేరాలు చేస్తూ చిక్కాడు. 

చోరీలకు పోలీసు సహకారం...
బాంబే సలీం వ్యవహారంలో ఇప్పటివరకూ లేని కొత్త కోణాన్ని పుణె క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు వెలికితీశారు. జైలుకు వెళ్లినప్పుడల్లా పాత దొంగలతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, బయటకు వచ్చాక వారికీ బెయిల్‌ ఇప్పించడం, వారితోనే ముఠా కట్టి దొంగతనాలు చేయడం.. ఈ పంథాలోనే సలీం నేరాలు చేస్తూ వచ్చాడు. ఇతడి కోసం దాదాపు రెండు నెలలకుపైగా గాలించిన పుణె పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. ఫలితంగానే సలీంకు ముంబై పోలీసు విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్‌ సహకరిస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వీరిద్దరికీ 2018లో పరిచయం అయినట్లు భావిస్తున్నారు. ఆ కానిస్టేబుల్‌ ఎలా సహకరిస్తున్నాడు? ఎందుకు ఆ పని చేస్తున్నాడు? తదితర అంశాలను ఆరా తీస్తున్నారు. మరోపక్క బాంబే సలీంపై నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లలో 2006 నుంచి కేసులు నమోదయ్యాయి. రాయదుర్గం, పంజగుట్ట, బాలానగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, నేరేడ్‌మెట్, సరూర్‌నగర్, శంషాబాద్, చైతన్యపురి, చందానగర్, మల్కాజిగిరి, మైలార్‌దేవ్‌పల్లి, మీర్‌పేట, కుషాయిగూడ, అల్వాల్‌ ఠాణాల్లో ఇవి ఉన్నాయి. 2000 సంవత్సరంలో గుంటూరులో వాహన చోరీ కేసు రిజిస్టర్‌ అయింది. ప్రస్తుతం సలీం పుణె పోలీసులకు చిక్కడంతో ఈ ఠాణాల అధికారులు అప్రమత్తమయ్యారు. తమ వద్ద నమోదైన కేసుల పరిస్థితి ఏంటి? నాన్‌– బెయిబుల్‌ వారెంట్లు జారీ అయ్యాయా? తదితర అంశాలు పరిశీలిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న చోరీ కేసుల్లోనూ ఇతడి పాత్రపై ఆరా తీస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top