
సాక్షి, హైదరాబాద్: అధికార బీజేపీ సహకారంతోనే దేశంలో ఆర్థిక నేరస్తులు పెరిగిపోతున్నారని, నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక అంబానీ, అదానీల ఆస్తులు పెరిగాయే తప్ప సామాన్యులకు ఒరిగిందేమీ లేదని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం సూత్రధారి నీరవ్ మోదీపై ఫిర్యాదు వచ్చినా పట్టించుకోకుండా పారిపోయే వరకు ఎందుకు అవకాశం కల్పించారని ప్రశ్నించారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురవరం మాట్లాడుతూ నీరవ్ మోదీ∙అవినీతిపై హరిప్రసాద్ అనే వ్యక్తి 2016లోనే ఫిర్యాదు చేశాడని, ఆ ఫిర్యాదుపై రెండేళ్లయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా 2018 జనవరిలో నీరవ్ పారిపోయే వరకు చేష్టలుడిగి చూశారని విమర్శించారు.
దావోస్‌లో నీరవ్ మోదీతో కలసి నరేంద్రమోదీ ఫొటో ఎలా దిగారని ఆయన ప్రశ్నించారు. నీరవ్‌మోదీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బోఫోర్స్ మాదిరిగా రాఫెల్ ఫైటర్ల ఒప్పందంపై కూడా విచారణ జరిపించాలని కోరారు. నిరుద్యోగాన్ని పారదోలుతానని, నల్లధనాన్ని వెనక్కు తెప్పిస్తానని ఎన్నికల్లో గెలిచిన నరేంద్రమోదీ ఇప్పుడు మతఘర్షణలను రెచ్చగొడుతూ వాటి ద్వారా గెలుస్తున్నారని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. వామపక్ష , లౌకికవాదులు, మేధావులు కలిస్తే సంఘ్‌పరివార్ అరాచకాలకు చెక్ పెట్టవచ్చని, ఇందుకోసం విశాల వేదిక ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 26 నుంచి కేరళలోని కొల్లామ్‌లో జరిగే పార్టీ జాతీయ మహాసభల్లో దీనిపై చర్చిస్తామని చెప్పారు. బీజేపీ చేతుల్లోంచి దేశానికి విముక్తి కల్పించడమే తమ పార్టీ లక్ష్యమని, దాని కోసమే పార్టీ పోరాడుతుందని సురవరం స్పష్టం చేశారు.