నమ్ముంచారు!

bhupathi raju revealed how is murdered gedela raju - Sakshi

హత్య కేసులో బంకు మేనేజరు, రెస్టారెంట్‌ నిర్వాహకుడు మరికొందరు ఉన్నట్టు వెల్లడి

రెండు హత్యల్లోనూ నమ్మక ద్రోహమే ఆయుధం

పద్మలతను నమ్మించి హతమార్చిన గేదెల రాజు

స్నేహం పేరుతో అతడిని అంతం చేసిన భూపతిరాజు

రెండు ఘాతుకాలకూ సూత్రధారి డీఎస్పీనే

కుటుంబానికి సన్నిహితుడినంటూ ఇంటివాళ్లకు దగ్గరైన వ్యక్తి కల్లబొల్లి మాటలు చెప్పి వాళ్ల విశ్వాసాన్ని సంపాదిస్తాడు. అదను చూసుకుని అన్నంలో విషం కలిపేసి విలన్‌ గ్యాంగ్‌కు ఇబ్బందిగా మారిన ఆ కుటుంబంలో ఒకరిని చంపేస్తాడు..
విలన్‌ గ్యాంగ్‌కు చెందిన కీలక సమాచారాన్ని గుప్పెట్లో పెట్టుకుని పదేపదే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న గూండాను, మరో అనుచరుడు నమ్మించి ఓ చోటుకు పిలిచి దారుణంగా అంతం చేస్తాడు. మన సినిమాలు చాలా వాటిలో తరచూ కనిపించే ఘట్టాలివి. నిత్య జీవితంలో అసాధ్యమనిపించే పరిణామాలివి.
కానీ డీఎస్పీ రవిబాబు ఘాతుకాల్లో ఈ రెండూ వాస్తవంగా జరిగాయి.  కల్పన కన్నా వాస్తవాలు విభ్రాంతికరంగా ఉంటాయనడానికి
ఇవి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

సాక్షి, విశాఖపట్నం : నమ్మించి వంచించి హతమార్చడం, తడిగుడ్డతో గొంతు కోయడం వంటి చాలా ఘాతుకాలు సినిమాల్లో చూసినప్పుడు ఒళ్లు గగుర్పొడుస్తుంది. అదంతా కల్పన అని తెలిసికూడా ఇంత ఘోరమా.. అని శరీరం జలదరిస్తుంది. అయితే వాస్తవ జీవితంలోనూ ఇలాటి కల్పనలకు మించిన దిగ్భ్రాంతికర పరిణామాలు చోటుచేసుకుంటాయని గేదెల రాజు, పద్మలతల హత్యోదంతాలను గమనిస్తే అర్థమై నివ్వెరపోవడం మనవంతవుతుంది. సుపారీలిచ్చి కిరాయి మనుషులతో హత్యలు చేయించే సంస్కృతి మన చుట్టూ ఇంతగా అభివృద్ధి చెందినందుకు గుండెల్లో అలజడి సుడులు తిరుగుతుంది.

నమ్మకం, స్నేహం ముసుగులో అంతం
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గేదెల రాజు, కాకర్ల పద్మలత హత్యోదంతాలు నమ్మకం, స్నేహం ముసుగులో చోటు చేసుకున్నాయి. అవస్థలు పడుతున్న వేళ అండగా ఉంటాడని నమ్మిన మాజీ ఎంపీపీ కాకర్ల పద్మలతను మరింతగా నమ్మించి, వంచించి.. ఆమెకు కాస్తయినా అనుమానం రాకుండా మట్టుపెట్టాడు కొప్పెర్ల సత్యనారాయణ రాజు అలియాస్‌ గేదెల రాజు. అక్రమాలలోనైనా స్నేహంగా ఉండే గేదెల రాజును నమ్మించి తన కార్యాలయానికి రప్పించి కిరాయి గూండాలో క్రూరంగా హతమార్పించాడు భూపతిరాజు శ్రీనివాసరాజు. ఈ రెండు హత్యలకు మూల కారణం ఎ–1 నిందితుడు, డీఎస్పీ దాసరి రవిబాబు నేర స్వభావమేనని పోలీసులకు లభించిన సమాచారం బట్టి స్పష్టమవుతోంది. ఆయన వివాహేతర సంబంధం ఈ ఘాతుకాలకు తెర తీయించింది. ఇద్దరి ప్రాణాలను బలికోరింది.

విషమే సాధనం
యలమంచిలి సీఐగా పనిచేసిన సమయంలో మాజీ ఎమ్మెల్యే కాకర్ల నూకరాజు కుమార్తె పద్మలతతో రవిబాబుకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆరేళ్ల పాటు సహజీవనం సాగించాక పద్మలత పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతో వివాదం మొదలైంది. పెళ్లికి రవిబాబు ముఖం చాటేశారని 2016 మార్చిలో డీజీపీకి పద్మలత ఫిర్యాదు చేయడంతో ఆమెను వదిలించుకునే దుర్మార్గానికి రవిబాబు పథక రచన చేశారు. గాజువాకకు చెందిన రౌడీషీటర్‌ గేదెల రాజు, క్షత్రియ భేరి పత్రిక ఎడిటర్‌ భూపతిరాజు శ్రీనివాసరాజుతో మంతనాలు జరిపారు. తోడల్లుడి స్థలాన్ని అమ్మి పద్మలతకు కొంత మొత్తం ముట్టజెప్పినా ఆమె పెళ్లికి పట్టుబట్టడంతో ఇక అడ్డు తొలగించుకోవడాలన్న నిర్ణయానికి రవిబాబు వచ్చారు. ఇందుకు గేదెల రాజుతో రూ.కోటి మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. భూపతిరాజు ద్వారా రూ.50 లక్షలు ఇప్పించారు. రంగంలోకి దిగిన గేదెల రాజు మాజీ ఎమ్మెల్యే కాకర్ల నూకరాజు కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకున్నాడు. రవిబాబుతో వివాదాన్ని పరిష్కరిస్తానని నమ్మించి ఆమెను గాజువాకలో ఓహŸటల్‌కు తీసుకొచ్చాడు.

మాట్లాడుకున్నాక అక్కడే ఉన్న రవిబాబు బిర్యానీలో విషం కలిపి పెట్టగా, అది తిన్న పద్మలత వెంటనే వాంతులతో అపస్మారక స్థితికి చేరుకోగా ఆమెను కేజీహెచ్‌కు తరలించారు. చనిపోతుందనుకున్న ఆమె కోలుకోవడంతో, గేదెల రాజు మరో స్కెచ్‌ వేశాడు. పూర్తిగా నయమయ్యేవరకు తన ఇంట్లోనే ఉండాలంటూ ఒత్తిడి తీసుకొచ్చి పద్మలతను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ నెమ్మదిగా విష ప్రయోగంచేసి మంచాన పడేటట్టు చేశాడు. రేకపల్లిలో మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్తే నయం అవుతుందని పద్మలత తండ్రిని నమ్మించి, వేరే వాహనంలో పద్మలత కుమారుడు మురళి, అతని మిత్రుడు కృష్ణ ఉండగా, గ్రామానికి కూత వేటు దూరంలో ఉండగా  హతమార్చాడు. గుండెపోటువచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించి దగ్గరుండి అంత్యక్రియలు చేయించాడు.

స్నేహమే ఆయుధం
తర్వాత గేదెల రాజు హత్య విషయంలో మళ్లీ అదే నమ్మక ద్రోహం కీలకమైంది. స్నేహం ఆ రౌడీ షీటర్‌ అంతానికి కారణమైంది. గేదెల రాజు, భూపతిరాజు శ్రీనివాసరాజు సుమారు పదిహేనేళ్లుగా స్నేహం పేరుతో మెలిసి తిరిగారు. సెటిల్‌మెంట్లు..దందాలు చేశారు. విశాఖ లోనే కాక రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, ఆర్థికపరమైన  సెటిల్‌మెంట్లు చేసేవారు. ఈ ఆర్థిక లావాదేవీలే పొరపొచ్చాలకు మూలమయ్యాయి. కొన్ని సెటిల్‌మెంట్లలో తనకు నష్టం కలిగించాడన్న అక్కసుతో గేదెలరాజుపై భూపతిరాజు కక్ష పెంచుకున్నా, గేదెల రాజు మాత్రం అతడిని ఎక్కువగానే విశ్వసించాడు. ఆ నమ్మకమే అతని పాలిట మృత్యువైంది. పద్మలత హత్య కోసం సెటిల్‌మెంట్‌ చేసుకున్న రూ.కోటి మొత్తంలో ఇంకా తనకు రావాల్సిన రూ. 50 లక్షల కోసం అతడు డీఎస్పీ రవిబాబుపై ఒత్తిడి తీసుకురావడం.. తన వద్ద రికార్డెడ్‌ ఎవిడెన్స్‌ ఉందంటూ బెదిరించడంతో గేదెల రాజును కూడా అడ్డు తొలగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన రవిబాబు ఆ విషయాన్ని భూపతిరాజుకు చెప్పారు.

తన కక్ష తీరడానికి ఇదే అవకాశంగా భావించిన భూపతిరాజు హత్యకు పథక రచన చేశాడు. అప్పటివరకు సఖ్యతను తగ్గించిన భూపతిరాజు, రవిబాబు నుంచి రూ.10 లక్షల సుపారీ తీసు కున్న తర్వాత గేదెల రాజుతో ముందెన్నడూ లేని సాన్నిహిత్యాన్ని ప్రదర్శించారు. తన కార్యాలయానికి వస్తే రవిబాబు చెల్లించాల్సిన సొమ్ము కోసం మాట్లాడదామని నమ్మబలికాడు. దీంతో గేదెల రాజు అక్కడికి వెళ్లగా, అతడిని మాటల్లో పెట్టి భూపతిరాజు కిరాయి మనుషులతో హత్య చేయించాడు. శవాన్ని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి నిప్పు పెట్టి తగలబెట్టాడు. మొత్తం మీద చూస్తే రెండు హత్యలూ నయవంచనకు, నమ్మక ద్రోహానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రవిబాబు అకృత్యంతో పద్మలత జీవితం, అతడి క్రూరత్వంతో గేదెల రాజు వ్యూహం ముగిసిపోయాయి. సుపారీ తీసుకుని నిస్సహాయురాలిని మట్టుపెట్టిన గేదెల రాజుకూ చివరికి అదే సుపారీ మృత్యుపాశం కావడం ఈ ఉదంతంలో విస్మరించలేని వాస్తవం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top