రెండేళ్లు.. రూ.6 కోట్లు!

Bhalki gang target in the temples for robberies at three states - Sakshi

     ఆలయాల్లోని పురాతన విగ్రహాలే భల్కీ ముఠా టార్గెట్‌ 

     తెలంగాణ సహా మూడు రాష్ట్రాల్లో దొంగతనాలు 

     ఇద్దరిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 

     రూ.3 కోట్ల విలువైన మూడు విగ్రహాలు స్వాధీనం

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటకలోని బీదర్‌కు చెందిన భల్కీ గ్యాంగ్‌ అది.. దేవాలయాల్లోని పురాతన పంచలోహ విగ్రహాలే దాని టార్గెట్‌.. రెండేళ్లలో 3 రాష్ట్రాల్లోని తొమ్మిది ఆలయాల్లో రూ.6 కోట్ల విలువైన 11 విగ్రహాలు తస్కరించింది.. కామారెడ్డిలో రూ.3 కోట్ల విలువైన 3 విగ్రహాలను ఎత్తుకెళ్లిన వారంలోనే హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఈ ముఠా చిక్కింది. మొత్తం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. 

గుడి దొంగల అడ్డా భల్కీ.. 
కర్ణాటక బీదర్‌ జిల్లా సమీపంలోని భల్కీ ప్రాంతం గుడి దొంగలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఢిల్లీ, మహారాష్ట్రలకు చెందిన పురాతన వస్తువుల స్మగ్లర్లు భల్కీ వాసులకు డబ్బు ఆశ చూపి దొంగలు గా మారుస్తున్నారు. చోరీ చేయడం తేలిక కావడం.. కొనేవారూ సిద్ధంగా ఉండటంతో భల్కీ గ్యాంగ్స్‌ ఏళ్లుగా పల్లె లు, పట్టణ శివార్లలో ని ఆలయాల్లో పురాతన పంచలోహ విగ్రహాలను దొంగతనం చేసి వాటిని ఢిల్లీ, మహారాష్ట్ర ముఠాలకు అమ్మేస్తున్నారు. భల్కీకి చెందిన ముఠాల్లో షేక్‌ హైదర్‌ గ్యాంగ్‌ ఒకటి. గతంలో హైదర్‌ చాంద్రాయణగుట్టలో దినసరి కూలీగా పనిచేశాడు. ఆ సమయంలో ఇదే ప్రాంతానికి చెందిన ఖాసింతో పరిచయమైంది. 

కర్ణాటకలో చోరీలు మొదలెట్టి.. 
ఖాసింతో జట్టు కట్టిన హైదర్‌ కర్ణాటకలోని బాగల్‌కోట్, బీజాపూర్‌ల్లోని 3 దేవాలయాల్లో దొంగ తనాలకు పాల్పడ్డారు. చివరికి పోలీసులకు చిక్కారు. బెయిల్‌పై బయటకొచ్చిన హైదర్‌ తమ ప్రాంతానికే చెందిన షేక్‌ ఎజాజ్‌తో జోడీ కట్టాడు. కర్ణాటకలో కేసులు ఉండటంతో ఈ ద్వయం మహారాష్ట్రను టార్గెట్‌ చేసుకుంది. గతే డాది ఔరంగాబాద్, లాథూర్‌ జిల్లాలోని ఖిల్లారీ, ఝాన్సీలో దొంగతనాలకు పాల్పడింది. ఈ విగ్రహాలను హైదరాబాద్‌ తీసుకువచ్చి విగ్రహాల స్మగ్లర్లకు నామమాత్రపు ధరకే అమ్మేసింది. మహారాష్ట్రలో నిఘా పెరగడంతో వీరి కన్ను తెలంగాణపై పడింది. 

దోమకొండలో సాధ్యం కాకపోవడంతో 
కామారెడ్డి జిల్లాలోని దోమకొండలో ఓ పురాతన దేవాలయం ఉన్న విషయం తెలుసుకున్న హైదర్, ఎజాజ్‌ గత శుక్రవారం అక్కడకు చేరుకున్నారు. ఆలయం లోపలకు వెళ్లేందుకు అను మతి లేక తిరిగి వచ్చేశారు. కామారెడ్డిలోనే బస చేసిన ఈ ద్వయం మరుసటి రోజు రాత్రి కామారెడ్డిలోని గోపాలస్వామి ఆలయంలోని వేణుగోపాలస్వామి, రుక్మిణి, సత్యభామల పంచలోహ విగ్రహాలు తస్కరించి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆ దేవాలయానికి సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించిన పోలీసులు ఇద్దరు అనుమానితుల్ని గుర్తించారు. 

పాత ‘మిత్రుడి’ సమాచారంతో.. 
పాత నేరగాళ్లపై దృష్టి పెట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాంద్రాయణగుట్టలో ఉన్న ఖాసింను పిలిపించారు. సీసీ కెమెరాల ఫీడ్‌లోని అనుమానితుల్ని చూపించగా.. హైదర్‌ను గుర్తించాడు. ఈ నేపథ్యంలో ఓ లాడ్జిలో బస చేసిన హైదర్, ఎజాజ్‌ ఆదివారం పోలీసులకు చిక్కారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న మూడు విగ్రహాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.3 కోట్లు ఉంటుందని తేల్చారు. నిందితులతో పాటు సొత్తును కామారెడ్డి పోలీసులకు అప్పగించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top