కొంపముంచిన ఫ్లెక్సీ!

Auto Lorry Accident in Prakasam Two Women Died - Sakshi

కూలీల ఆటోను ఢీకొన్న లారీ

ఇద్దరు మహిళల దుర్మరణం

మరో ఇద్దరి పరిస్థితి విషమం

తొమ్మిది మందికి తీవ్ర గాయాలు

క్షతగాత్రులకు రిమ్స్, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స

ప్రకాశం , నాగులుప్పలపాడు: పొట్ట చేతబట్టుకొని వాహనాల్లో మైళ్లకొద్దీ ప్రయాణం చేసి కూలీనాలి చేసుకొనే ఆ పేదల బతుకులు క్షణాల్లో తెల్లారాయి. ఫ్లెక్సీ రూపంలో మృత్యువు కబళించింది. ఓ ఫ్లెక్సీ అడ్డుగా ఉండటంతో దారి కనిపించక కూలీల ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. మండలంలోని అమ్మనబ్రోలు రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న ఎస్టీ కాలనీ నుంచి కొందరు కూలీలు పోతవరంలోని రైతుకు మిరప కాయలు కోసేందుకు స్వగ్రామం నుంచే నేరుగా ఆటో మాట్లాడుకొని రోజూ వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ఆటోలో డ్రైవర్‌తో పాటు 12 మంది మహిళా కూలీలు మిరపకాయల కోతకు వెళ్తున్నారు. కూలీలతో ఉన్న ఆటో పోతవరం సమీపంలోని సలివేంద్రం కుంటకు వచ్చే సరికి తిమ్మనపాలెం బైపాస్‌ నుంచి నిడమానూరు మీదుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఆటో రోడ్డు పక్కనే ఉన్న మైలేజ్‌ రాయిని ఢీకొని రెండు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పొలంలో పడింది.

ఆటోలో ఉన్న ఇండ్ల రమణమ్మ (62) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ పాలపర్తి సుభాషిణమ్మ (60) ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందింది. రోడ్డు పక్కనే ఉన్న ఫ్లెక్సీ చాటుగా ఉండటంతో అటు వైపుగా వెళ్లే వాహనం కనిపించక ప్రమాదం జరిగిందని లారీ డ్రైవర్‌ పోలీసులతో చెప్పాడు. ఇటీవల కాలంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు నూతన సంవత్సరం సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ కుంట మీద ఏర్పాటు చేయడంతో నిడమానూరు, పోతవరం గ్రామాల వైపు నుంచి వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ఇటీవల రెండు మోటారు సైకిళ్లు కూడా ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టుకున్నాయి. లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటోలోని కూలీలను  స్థానికులు, పోలీసులు రక్షించారు. అనంతరం 108లో రిమ్స్‌కు తరలించారు. పాదర్తి ధనలక్ష్మి, కూచిపూడి కుమారి పరిస్థితి విషమంగా ఉండటంతో వేర్వేరు ప్రైవేట్‌ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మిగిలిన తొమ్మిది మందికి రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఒంగోలు రూరల్‌ సీఐ దుర్గాప్రసాద్, ఎస్‌ఐ బాజీ నాగేంద్ర ప్రసాద్‌ పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top