
గాయపడ్డ నారాయణస్వామి, అలివేలమ్మ
అనంతపురం ధర్మవరం అర్బన్: భూ తగాదాల నేపథ్యంలో అత్తమామలపై మేనల్లుడు కొడవలితో హత్యాయత్నం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు.. ధర్మవరం పట్టణంలోని గుట్టకిందపల్లిలో నివాసముంటున్న దాసరి నారాయణస్వామి, అలివేలమ్మ దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నారాయణస్వామి తండ్రి యల్లప్పకు ప్రభుత్వం కుణుతూరు పొలంలో 3.15ఎకరాల భూమి మంజూరు చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నారాయణస్వామి తన అక్క కపాడం సాలమ్మ కుమారుడు కపాడం శివయ్యకు రూ.2.80 లక్షలకు అమ్మాడు. కాగా నారాయణస్వామి బ్యాంకులో తీసుకున్న రుణం మాఫీ అవుతుందని, అది వర్తించాక భూమిని రిజిష్టర్ చేయిస్తానని చెప్పగా శివయ్య అందుకు అంగీకరించాడు.
అనంతరం వారి మధ్య మనస్పర్థలు రావడంతో శివయ్యకు భూమిని రిజిస్ట్రేషన్ చేయించలేదు. ఈ భూమి విషయంపై పలుమార్లు గొడవ పడ్డారు. ఆదివారం ఉదయం దాసరి నారాయణస్వామి, భార్య అలివేలమ్మ తోటలో పాలు పితుకుతుండగా కపాడం శివయ్య కొడవలితో వెళ్లి అత్త దాసరి అలివేలమ్మపై దాడి చేసి హత్యాయత్నం చేశాడు. గమనించిన నారాయణస్వామి అడ్డుపడగా అతనిపై కూడా దాడి చేశాడు. వారి కేకలు విన్న స్థానికులు అక్కడికి రాగానే శివయ్య పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన నారాయణస్వామి, అలివేలమ్మలను బంధువులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యులు చికిత్సలు చేసి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.