
రక్తపు మడుగులో తిప్పేష్ మృతదేహం (ఇన్‌సెట్‌లో) తిప్పేష్ (ఫైల్)
తమ కుమారుడు సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగం సాధించడంతో పేదరికంలో ఉన్న ఆ తల్లిదండ్రులు సంతోషించారు. కుటుంబానికి దూరంగా ఉంటాడని తెలిసినా దేశ రక్షణ కోసం పని చేస్తాడని గర్వపడ్డారు. తమను బాగా చూసుకుంటాడని కలలుగన్నారు. అయితే ఏడాది తిరగకుండా వారి సంతోషం కనుమరుగైంది. కుమారుడి మరణ వార్త వారి కలలను కల్లలు చేసింది. వారి జీవితాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.
సాక్షి, కళ్యాణదుర్గం: పట్టణానికి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ అసోంలోని గువాహటిలో మృతి చెందాడు. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది. వివరాలిలా ఉన్నాయి..పట్టణంలోని మారెంపల్లి కాలనీకి చెందిన నాగభూషణ, మల్లేశ్వరమ్మలకు ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడు తిప్పేష్ సీఆర్‌పీఎఫ్‌లో ఏడాది క్రితం ఉద్యోగం సంపాదించాడు. రెండో కుమారుడు నరేష్ డ్రిగీ పూర్తి చేసి త్రండికి చేదోడుగా బార్బర్ షాపులో పనిచేస్తున్నాడు. మూడో కుమారుడు జగదీష్ డిగ్రీ చదువుతున్నాడు. తిప్పేష్ ప్రస్తుతం ఆస్సాంలోని గుహవాటిలో పని చేస్తున్నాడు. నెల క్రితం స్వగ్రామానికి వచ్చి సెలవులు పూర్తి కాగానే గతనెల 23న తిరిగి ఉద్యోగానికి వెళ్లాడు.
గురువారం తెల్లవారుజామన 2.00 గంటల సమయంలో తండ్రి నాగభూషణకు సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండర్ రాజ్‌కుమార్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తిప్పేష్ మృతి చెందినట్లు ఆయన సమాచారం ఇచ్చారు. దీంతో మారెంపల్లికాలనీతోపాటు పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిప్పేష్ మృతదేహాన్ని శుక్రవారం కళ్యాణదుర్గం తీసుకురానున్నారు. కుమారుడి మృతిపై తల్లిదండ్రుల అనుమానం తిప్పేష్ మృతి పట్ల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలంలో తిప్పేష్ రక్తపు మడుగులో ఉన్నట్లు ఫొటోలో కనిపిస్తోంది. అయితే తమ కుమారుడు ఎలాంటి వివాదాలకు వెళ్లేవాడు కాదని, సహచర ఉద్యోగులు ఏమైనా చేశారా.. లేక ఇంకేమైనా జరిగిందా అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై సంబంధిత అధికారుల నుంచి సరైన సమాచారం అందలేదు. కొరవడిన స్పష్టత తిప్పేష్ మృతిపై సంబంధిత ఉన్నతాధికారుల నుంచి స్పష్టత రావడం లేదు. సంబంధిత అసిస్టెంట్ కమాండర్‌ను ఫోన్‌లో ‘‘సాక్షి’’ వివరణ కోరగా సమాధానం రాలేదు. విధులలో ఉన్నప్పుడే మరణించాడని సమాధానం చెబుతున్నారు. మిస్‌ఫైర్ అయ్యిందా లేక సూసైడ్ చేసుకున్నాడా?, ప్రత్యర్థి వర్గాల చేతుల్లో హతమయ్యాడా అనే వివరాలను అసిస్టెంట్ కమాండర్‌తో ఆరాతీయగా తాను పోస్టుమార్టం వద్ద ఉన్నానని, వివరాలు అక్కడికి వచ్చాక చెబుతానని సమాధానం దాట వేశారు.