లైసెన్స్‌ దందా!

agents corruption in RTO office - Sakshi

ఆర్టీఓ కార్యాలయంలో దళారీల పాగా

ఏజెంట్ల జోక్యంతోనే అధిక శాతం పనులు

అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్న వైనం

క్యూలో నిల్చొంటే పని కావడం అనుమానం

దళారీల చేతిలో డబ్బు పెడితే అంతా సవ్యం

కమిషనర్‌ ఉత్తర్వులు బేఖాతరు

దళారీల జోక్యానికి అడ్డుకట్ట వేసేందుకు రవాణా శాఖ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులు బేఖాతరు అవుతున్నాయి. పేరుకు ఆన్‌లైన్‌ అన్న మాటే కానీ.. వ్యవహారం అంతా ఏజెంట్ల కనుసన్నల్లోనే సాగుతోంది. క్యూలో నిల్చొన్నా.. కొర్రీలతో కాలయాపన చేస్తుండటంతో ప్రజలు కూడా చేయి తడపక తప్పని పరిస్థితి. ఆన్‌లైన్‌ పుణ్యమా అని ‘వ్యాపారం’ తగ్గిపోయింది కాబోలు.. అధికారులు కూడా ‘మధ్యే’మార్గం ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. హిందూపురం ఆర్టీఓ కార్యాలయం వద్ద కనిపించిన దృశ్యాలే ఇందుకు సాక్ష్యాలు.

హిందూపురం అర్బన్‌: ‘‘రవాణా శాఖ కార్యాలయాల్లో దళారీలకు ప్రవేశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో బయటి వ్యక్తుల ప్రమేయాన్ని సహించబోం. కార్యాలయాల్లోకి పనుల కోసం వచ్చే వారిని పరిశీలించి మరీ లోనికి అనుమతిస్తాం. ప్రజలకు సహాయం చేసేందుకు హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేస్తాం. దళారీల అక్రమాలపై నిఘాను పటిష్టం చేస్తాం.’’
– ఇదీ రవాణా శాఖ కమిషనర్‌ నిర్ణయం

కొద్దిరోజుల పాటు ఈ ఆదేశాలు అమలయినా.. ఆ తర్వాత షరా మామూలే. ఆర్టీఓ కార్యాలయంలో దళారీలు లేనిదే పని జరగదనే విషయం అర్థమయ్యేందుకు ప్రజలు ఎన్నో రోజులు పట్టలేదు. చదువుకున్న వారైనా.. నిరక్షరాస్యులైనా మధ్యవర్తులను ఆశ్రయిస్తే తప్ప పని జరగని పరిస్థితి. ఈ నెల 11న హిందూపూర్‌కు చెందిన ప్రకాష్‌ కొత్త బండి రిజిస్ట్రేషన్, ఫ్యాన్సీ నంబర్‌ కోసం.. రవాణా శాఖ కార్యాలయంలో నేరుగా వెళ్లి కలిశాడు. బిల్లులు.. పత్రాలు.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌.. ఇలా చాంతాడు నిబంధనలు చెప్పగా మూడు రోజుల పాటు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఫ్రెండ్‌ సలహా మేరకు ఏజెంట్‌ను కలిసి రూ.7,500 చేతిలో పెట్టడంతో ఇట్టే పనైపోయింది.

అదేవిధంగా ఈనెల 5వ తేదీన చోళూరు గ్రామానికి చెందిన చరణ్‌ లెర్నింగ్‌ లైసెన్సు కోసం రూ.260 చలానా కట్టి, లైసెన్సు కోసం రూ.1200 మరో చలానా కట్టి ఆఫీసు సిబ్బంది చెప్పిన ఆధార్, దరఖాస్తు, ఫొటోలు అందజేసి ఆన్‌లైన్‌ పరీక్షకు హాజరయ్యాడు. డిగ్రీ పూర్తిచేసిన ఇతను ఆన్‌లైన్‌ పరీక్ష పాస్‌ కాలేకపోయాడు. అతనితో పాటు పరీక్షకు హాజరైన పదవ తరగతి పాసైన బీడీ బంకు అబ్దుల్‌ పాసయ్యాడు. ఇతను దళారీకి రూ.5వేలు చెల్లించడంతో పని పూర్తయినట్లు తెలుసుకున్న ప్రకాష్‌.. తిరిగి ఆ ఏజెంట్‌ను కలిసి చలానాతో పాటు రూ.2వేలు సమర్పించుకోవడంతో ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. ఇలా.. ఆర్టీఓ కార్యాలయంలో ఎలాంటి పనైనా దళారీల ద్వారానే సాగుతోంది. ఏజెంట్ల దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కార్యాలయం పరిసరాల్లోని టీ బంకులు, జిరాక్సు షాపుల్లో ఏజెంట్లు పాగా వేసి పని కానిచ్చేస్తున్నారు. కార్యాలయం ప్రారంభానికి ముందు.. సాయంత్రం వేళల్లో ప్రయివేట్‌ వ్యక్తులు నేరుగా వెళ్లి పలు విభాగాల్లో చక్రం తిప్పుతుండటం గమనార్హం.

దస్తూరి, ఇనిషియల్‌ కోడ్‌తో చేపట్టిన రిజిస్ట్రేషన్లు, ఇతరత్రాల లెక్కింపు రిజిస్ట్రేషన్, లైసెన్సు, నెంబర్‌ ఇలా ఏ పనికోసం వచ్చిన దరఖాస్తులనైనా చేతిరాత.. లేదంటే కోడ్‌ ఆధారంగా దందా సాగుతోంది. ఇలాంటి దరఖాస్తులకు ఎలాంటి అభ్యంతరాలు పెట్టడం లేదని.. నేరుగా వచ్చే దరఖాస్తుల విషయంలోనే కొర్రీలు వేస్తున్నట్లు తెలుస్తోంది. సవాలక్ష ప్రశ్నలతో విసిగించడం.. అవసరమైన కాగితాలన్నీ పూర్తిస్థాయిలో లేవని చెప్పి పంపుతుండటంతో దరఖాస్తుదారులు విధిలేని పరిస్థితుల్లో దళారీలను ఆశ్రయిస్తున్నారు. దరఖాస్తులు పూరించడం మొదలు.. క్యూలైన్‌లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా దళారీలు అన్ని పనులు సవ్యంగా చేసి పెడుతుండటంతో మధ్యవర్తులతోనే పని కానిచ్చేస్తున్నారు. జేబుకు చిల్లు పడుతుందనే విషయం తెలిసినా తప్పదన్నట్లు చేయి తడుపుతున్నారు.

కనిపించని హెల్ప్‌డెస్క్‌
దళారీలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ఆర్టీఓ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్‌ ప్రకటించినా.. హిందూపురంలో ఆ ఊసే కరువయింది. దరఖాస్తులు పూరించడం.. ఎలాంటి పత్రాలు సమర్పించాలి.. ఎక్కడ వీటిని అందజేయాలి? ఇతరత్రా సమస్యలకు ఇక్కడ సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు. ఇక్కడి సెక్యూరిటీ గార్డులు కనీసం లోపలికి వెళ్లనివ్వకపోవడం చూస్తే దళారీలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. మరో నాలుగు రోజుల్లో ఆర్టీఓ కార్యాలయం సొంత భవనంలోకి మారుతున్న నేపథ్యంలో అక్కడైనా దళారీల దందాకు అడ్డుకట్ట వేసి కమిషనర్‌ ఆదేశాలను పాటించాలని స్థానికులు కోరుతున్నారు.

కఠినంగా వ్యవహరిస్తాం
కార్యాలయం వద్ద సాధ్యమైనంత వరకు దళారీలు, మ«ధ్యవర్తులను నియంత్రిస్తున్నాం. గతంతో పోలిస్తే.. నేను బా«ధ్యత తీసుకున్న తర్వాత చాలా వరకు తగ్గింది. వారి జోక్యాన్ని పూర్తిగా అడ్డుకుంటాం. ప్రయివేట్‌ బిల్డింగ్‌ కావడంతో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు కష్టమయింది. కొత్త కార్యాలయంలోకి వెళ్లాక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసి మరింత కఠినంగా వ్యవహరిస్తాం.
– మల్లికార్జున, ఇన్‌చార్జి ఆర్టీఓ, హిందూపురం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top