అక్రమాస్తులు @ రూ.100కోట్లు!

ACB Rides in houses of two corrupt officials - Sakshi

ఇద్దరు అవినీతి అధికారుల ఇళ్లలో ఏసీబీ సోదాలు 

రూ.100 కోట్ల విలువైన అక్రమాస్తుల గుర్తింపు 

పర్యాటక శాఖ ఎస్టేట్‌ ఆఫీసర్‌కు రూ.80 కోట్లు – నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌కు రూ.20 కోట్లు అక్రమాస్తులున్నట్లు గుర్తింపు 

నేడు కూడా కొనసాగనున్న సోదాలు 

విజయవాడ/సీతమ్మధార (విశాఖ): ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు.. రాష్ట్ర పర్యాటక శాఖ ఎస్టేట్‌ ఆఫీసర్‌ ఆర్‌.శివరావు, నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ హనుమంతు శంకరరావు ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో శివరావుకు రూ.80 కోట్లు, శంకరరావుకు రూ.20 కోట్ల అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీబీ సెంట్రల్‌ టీమ్‌కు చెందిన 25మంది అధికారులు డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో విజయవాడలోని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యాలయంలో ఎస్టేట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శివరావు ఇంటితో పాటు, ఆయన బంధువుల ఇళ్లల్లో మొత్తం 6చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శివరావు భార్య, అత్త, బావమరిది, బంధువుల ఇళ్లపై దాడులు చేశారు.  వారి పేరు మీద దాదాపు రూ.80కోట్ల విలువ చేసే భూములు, స్థలాలు, ఇళ్లకు చెందిన డాక్యుమెంట్లు, చెక్కులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

విజయవాడ నగరంలో బందరు రోడ్డు పక్కనే ఉన్న టిక్కిల్‌ రోడ్డులో శ్వేత టవర్స్‌లో నివాసం ఉంటున్న శివరావు ఇంట్లో 793 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి ఆభరణాలు, చెక్కులు డాక్యుమెంట్లు సోదాల్లో దొరికాయి. సోదాల్లో మొత్తం 14 ఇంటి ఫ్లాట్లు, 2 ఫ్లాట్లు 2ఇళ్లు, 0.96సెంట్ల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తమ సమీప బంధువులైన  అన్నపూర్ణమ్మ, సుబ్బారావు, శ్రీనివాసరావు పేర్లతో  4 స్థలాలు కంకిపాడు, కంచికచర్లలో కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ప్రస్తుతానికి స్వాధీనం చేసుకున్న మొత్తం శివరావు అక్రమాస్తులు బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.80 కోట్లు ఉండవచ్చని ఏసీబీ అధికారులు చెప్పారు. కాగా విచారణ  గురువారం కూడా కొనసాగుతుందని తెలిపారు. ఇంకా బ్యాంకు లాకర్లు  తెరవాల్సి ఉందని డీఎస్పీ రమాదేవి చెప్పారు.
 
నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌పై కేసు నమోదు.. 
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ హనుమంతు శంకరరావు ఇళ్లలో సోదాలు జరిపిన అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌ ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, నర్సీపట్నం, మధురవాడ, బొబ్బిలి, పలాస, టెక్కలి, భీమిలిలో సోదాలు నిర్వహించారు. రామకృష్ణ ప్రసాద్‌  వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ సోదాల్లో విశాఖపట్నం ఎంవీపీకాలనీ, సెక్టార్‌–4లో 207 గజాల స్థలంలో ఇల్లు, మధురవాడ వాంబేకాలనీలో 267 గజాల్లో మూడు ఆంతస్తుల భవనం, భీమిలి, సంగివలస, నేరెళ్ల వలసలో 60 సెంట్ల భూమి ఉన్నట్లు గుర్తించారు. చిట్టివలస స్టేట్‌బ్యాంకు, భీమిలి స్టేట్‌బ్యాంకులో రూ.5 లక్షలు, బొబ్బిలి కరూర్‌ వైశ్యా బ్యాంకులో రూ.2లక్షల 50 వేలు విలువ గల బంగారం తనఖాలో ఉన్నట్లు గుర్తించారు. కొన్ని స్థలాలు బినామీల పేరుతో ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.20 కోట్ల పైన ఉంటుంది. శంకరావును అరెస్టు చేసి గురువారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌ తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top