ఏలూరులో సీబీఐ దాడులు

ACB Raids In Eluru Caught PF Officer - Sakshi

లంచం తీసుకుంటూ చిక్కిన పీఎఫ్‌ అధికారి

ఏలూరు టౌన్‌:ఏలూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా జిల్లా ఈపీఎఫ్‌ కార్యాలయ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఎల్‌.ఆనందరావును సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సాయంత్రం 3.30 గంటలకు ఏలూరు వచ్చిన విశాఖపట్నం సీబీఐ అధికారుల బృందం జిల్లా ఈపీఎఫ్‌ కార్యాలయాన్ని జల్లెడపడుతున్నారు. రాత్రి 11.30 గంటల వరకూ కార్యాలయంలో సోదాలు చేస్తూనే ఉన్నారు. లంచావతారం ఎత్తిన అ«ధికారితోపాటు, కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని సైతం ప్రశ్నించారు. గతంలో పీఎఫ్‌ మంజూరు రికార్డులను, ఇతర ఆసుపత్రులకు సంబంధించిన ఫైళ్లు తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏలూరు అమీనాపేటలోని చైత్ర ఆసుపత్రి యాజమాన్యం అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఈపీఎఫ్‌ చెల్లించటంలేదని జిల్లా ఈపీఎఫ్‌ కార్యాలయానికి కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఫిర్యాదు మేరకు ఈపీఎఫ్‌ కార్యాలయ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఎల్‌.ఆనందరావు ఆసుపత్రి తనిఖీ చేసేందుకు వెళ్ళారు. తనిఖీలు చేసిన అధికారి ఆనందరావు తనకు సొమ్ములు ఇస్తే ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుంటానని, లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తాము నిబంధనల మేరకు పీఎఫ్‌ వాటా చెల్లిస్తామని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. అయినా అధికారి రూ.50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం విశాఖపట్నంలోని సీబీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. సీబీఐ అధికారులు పక్కా ప్లాన్‌ వేసి బుధవారం సాయంత్రం ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని ఎల్‌ఐసీ కార్యాలయం రోడ్డులోని ఈపీఎఫ్‌ జిల్లా కార్యాలయానికి వెళ్ళి ఆసుపత్రి సిబ్బంది రూ.40 వేలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయ రికార్డుల మేరకు అధికారి ఆనందరావును సీబీఐ అధికారులు అర్ధరాత్రి వరకూ విచారిస్తునే ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top