ఈఎస్‌ఐపై ఏసీబీ దాడి: ఏడుగురు అరెస్టు

ACB Officers Attacked On ESI Hospital And Arrested 7 People In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ఈఎస్‌ఐ ఆసుపత్రిపై అవీనీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి డైరెక్టర్‌ దేవిక రాణితో పాటు మరో ఏడుగురిని గురువారం అరెస్టు చేశారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో దేవికా రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో దేవిక కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవసరం లేకున్నా.. నకిలీ బిల్లులు సృష్టించి మందులు కొనుగోలు చేసి ఈఎస్‌ఐ అధికారులు భారీ స్కాంకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ. 10కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చి దేవికా రాణిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో దేవిక రాణి ఈఎస్‌ఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలపై శుక్రవారం ఆరా తీశారు. ఈఎస్‌ఐ నిబంధనలకు విరుద్ధంగా మందులు కొనుగోలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అలాగే ఇప్పటి వరకు కేవలం 5 ఇండెంట్లు మాత్రమే పరిశీలించామని, ఇంకా 200 ఇండెంట్లు పరిశీలించాల్సి ఉన్నట్లు తెలిపారు.

అదే విధంగా పది శాతం దర్యాప్తు పూర్తి చేసిన క్రమంలో డైరెక్టర్‌ దేవికా రాణితో పాటు, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఫార్మసిస్ట్ రాధిక, నాగరాజు, ఓమ్నీ మెడికల్‌ సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్, ఎండీ శ్రీహరిలను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టామని, అలాగే మరో నలుగురిని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించి వారిపై ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ చట్టం’, ఫోర్జరీ, చీటింగ్, క్రిమినల్ కాన్స్ఫరెసి, విధులను దుర్వినియోగ పరచడం వంటి పలు సెక్షన్ల(120 (B) r/w 34,  477(A) 465, 468,  471, 420) కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అలాగే వీరిని 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించామని తెలిపారు. దీంతో ఏసీబీ అధికారులు వారం రోజులు పాటు కస్టడీ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయగా, ఇది సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే సుమారు 200 మెడికల్‌ ఏజెన్సీల రికార్డులు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. కాగా ఈఎస్‌ఐలోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎమ్‌ఎస్‌) విభాగంలోని అవీనీతి పుట్ట బద్దలైన విషయం తెలిసిందే.  అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు ఐఎమ్‌ఎస్‌ విభాగానికి చెందిన 23 మంది ఉద్యోగుల ఇళ్లపై నిన్న (గురువారం) ఏకకాలంలో దాడులు జరిపారు. దాదాపు రూ.12 కోట్ల నకిలీ బిల్లులకు సంబంధించి కీలకమైన ఆధారాలు సంపాదించారు.

(చదవండి: ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికా రాణి అరెస్ట్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top