ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికా రాణి అరెస్ట్‌  | ESI Medicines Scam: Director Devika Rani Arrested By ACB | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికా రాణి అరెస్ట్‌ 

Sep 27 2019 9:07 AM | Updated on Sep 27 2019 10:04 AM

ESI Medicines Scam: Director Devika Rani Arrested By ACB - Sakshi

ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికా రాణిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌ : ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికా రాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. షేక్‌పేటలోని తన నివాసం నుంచి ఆమెను బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో దేవికా రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయంలో తెలిసిందే. దీంతో నిన్నంతా దేవికా రాణి కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 17మంది ఉద్యోగులు, నలుగురు ప్రయివేట్‌ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 

నకిలీ బిల్లులు సృష్టించి, అవసరం లేకున్నా మందులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ,  సుమారు రూ.10 కోట్ల వరకూ కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా తేల్చింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌లోనూ ఇంకా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో దేవికా రాణితో పాటు జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత, ఫార్మసిస్ట్‌ రాధిక, ఈఎస్‌ఐ ఉద్యోగి నాగరాజు, సీనియర్‌ అసిస్టెంట్‌ హర్షవర్థన్‌, ఎండీ శ్రీహరిని అరెస్ట్‌ చేసి, ఈఎస్‌ఐ సిబ్బందిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇవాళ మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే 23 ప్రదేశాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు, బంగారాన్ని సీజ్‌ చేశారు. మరోవైపు దేవికా రాణి ఇంట్లో రెండు సూట్‌కేసులు, రెండు బ్యాగుల డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, బ్యాంక్‌ అకౌంట్‌ పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఈఎస్‌ఐలోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎమ్‌ఎస్‌) విభాగంలోని అవీనీతి పుట్ట బద్దలయింది.  అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు ఐఎమ్‌ఎస్‌ విభాగానికి చెందిన 23 మంది ఉద్యోగుల ఇళ్లపై నిన్న (గురువారం) ఏకకాలంలో దాడులు జరిపింది. దాదాపు రూ.12 కోట్ల నకిలీ బిల్లలుకు సంబంధించి కీలకమైన ఆధారాలు సంపాదించింది. 

దేవికా రాణిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలింపు

నేపథ్యం ఏంటి?
ఐఎమ్‌ఎస్‌ విభాగంలో మందుల కొనుగోళ్లలో నిబంధనలు తుంగలో తొక్కారని, భారీగా అక్రమాలు జరిగాయని, కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఐఎమ్‌ఎస్‌ ఉద్యోగులు, మెడికల్‌ ఏజెన్సీలు టెండర్లు లేకుండా నకిలీ బిల్లులతో కోట్లాది రూపాయలు దిగమింగారని ఫిర్యాదులు వెల్లువెతాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజానిజాలను తేల్చాని ఈఎస్‌ఐ ముఖ్యకార్యదర్శి శశాంక్‌ గోయల్‌ ఏసీబీకి లేఖ రాసారు. ఈ మేరకు ఈ కేసును ఏసీబీ స్వీకరించింది. ముందుగా విజిలెన్స్‌ విభాగం రంగంలోకి దిగింది. పలు రికార్డులను, కొనుగోళ్లను పరిశీలించిన విజిలెన్స్‌ అధికారులు అక్రమాలను ధ్రువీకరిస్తూ ఏసీబీకి నివేదిక అందజేసారు. 


దేవిక రాణి నివాసంలో ఏసీబీ తనిఖీలు

రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంగా ఐఎమ్‌ఎస్‌ అధికారుల ఇళ్లపై దాడులు చేసారు. ఈ విభాగానికి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ డైరెక్టర్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత, ఆమ్నీ మెడికల్‌ ఎండీ శ్రీధర్, నాగరాజు, తేజ్‌ ఫార్మాకు చెందిన సుధాకర్‌రెడ్డి, వీ–6 చానల్‌ రిపోర్టర్‌ నరేందర్‌రెడ్డితోపాటు పలువురు ఉద్యోగులు కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ బిల్లులు, తప్పుడు రికార్డులతో టెండర్లు లేకుండా మందులకు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది.


షేక్‌పేటలోని దేవికా రాణి నివాసం

ఏసీబీ అధికారులు ఏమంటున్నారు
ఐఎమ్‌ఎస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డా.కె.పద్మ 2018 మే 26, 28వ తేదీల్లో రూ.1.03 కోట్ల నకిలీ బిల్లులను రూపొందించారు. వీటిని పటాన్‌చెరు, బోరబండ ఇన్‌ఛార్జి మెడికల్‌ ఆఫీసర్ల సాయంతో ఈ బిల్లులు క్లెయిమ్‌ చేశారు.అదే నెలలో బొంతపల్లి, బొల్లారం డిస్పెన్సరీలకు రూ.1.22 కోట్ల నకిలీ బిల్లులు తయారు చేసి మందులను మాత్రం పంపకుండా డబ్బులు జేబులో వేసుకున్నారు. ఐఎమ్‌ఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణి ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత ఇందిరతో కలిసి ఏకంగా రూ.9.43 కోట్లను బిల్లులపేరిట 2017–18 ఆర్థిక సంవత్సరంలో స్వాహా చేశారు. మొత్తంగా మందుల కోనుగోళ్ల పేరిట రూ.11.69 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఐఎమ్‌ఎస్‌ సిబ్బందితోపాటు పలువురు ప్రైవేటు మెడికల్‌ ఏజెన్సీల ఉద్యోగులు కూడా పాలుపంచుకున్నారు. మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ శివ, తేజ ఫార్మా  ఏజెంట్‌ సుధాకర్‌రెడ్డి, ఆమ్నీ మెడిసిన్స్‌కు చెందిన శ్రీహరి, వీ–6 చానల్‌ రిపోర్టర్‌ నరేందర్‌రెడ్డి ఇళ్లపైనా దాడులు జరిగాయి. ఈ విషయంలో మరింత లోతుగా విచారణ జరిపితే...మరిన్నిఅ క్రమాలు వస్తాయని ఈఎస్‌ఐ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement