ఏసీబీ వలలో ‘చిన్ననీటి’ చేపలు

Acb Attacks On Water Resources Officials - Sakshi

లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

అనంతపురం సెంట్రల్‌: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు రెండు ‘చిన్న నీటి’ చేపలు చిక్కాయి. నీరు–చెట్టు పనుల బిల్లుల చెల్లింపులో కాంట్రాక్టర్‌ నుంచి లంచం డిమాండ్‌ చేసి చిన్ననీటి పారుదలశాఖ (జలవనరుల శాఖ) తాడిపత్రి సబ్‌ డివిజన్‌ డీఈ వీరారెడ్డి, ఏఈ డాక్యానాయక్‌లు బుధవారం అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే... పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరు పరిధిలో రెండు నీటి కుంటలకు ‘నీరు–చెట్టు’ కింద రూ. 18 లక్షలతో ఫీల్డ్‌ చానల్‌ వర్క్‌ పనులు చేపట్టారు. రవిశంకర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌ దక్కించుకున్న ఈ పనులను సబ్‌లీజుకు అనంతపురం నగరానికి చెందిన ఆదినారాయణ చేస్తున్నారు. పూర్తి చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయకుండా డీఈ వీరారెడ్డి, ఏఈ డాక్యానాయక్‌లు కొద్దిరోజులు పెండింగ్‌లో పెట్టారు. కాంట్రాక్టర్‌ ఆదినారాయణ పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా చేయలేదు. చివరకు లంచం ఇవ్వాలని డీఈ, ఏఈలు డిమాండ్‌ చేశారు. రూ. 50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

వల పన్ని పట్టుకున్నారిలా...
చిన్న నీటి పారుదలశాఖ అధికారులు లంచం డిమాండ్‌ చేయడంతో బాధిత కాంట్రాక్టర్‌ ఆదినారాయణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించారు. ఇన్‌చార్జ్‌ డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో ఏసీబీ సీఐలు ప్రతాప్‌రెడ్డి, ఖాదర్‌బాషా, చక్రవర్తిలు పక్కా ప్లాన్‌ వేశారు. బాధిత కాంట్రాక్టర్‌ డబ్బుతో నగరంలోని చిన్ననీటి పారుదలశాఖ కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కార్యాలయ ఆవరణలో  డీఈ వీరారెడ్డి, ఏఈ డాక్యానాయక్‌లు లంచం తీసుకున్నారు. డబ్బును జేబులో పెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఈ వీరారెడ్డి రూ. 20 వేలు, ఏఈ డాక్యానాయక్‌ రూ. 26 వేలు తీసుకున్నారు. 

ఇళ్లల్లోనూ సోదాలు : అనంతపురం శారదానగర్‌లోని డీఈ వీరారెడ్డి నివాసం, రామ్‌నగర్‌లోని ఏఈ డాక్యానాయక్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు రాత్రి వరకూ కొనసాగాయి. నిందితులను గురువారం కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ జయరామరాజు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top