ఏసీబీకి చిక్కిన బీమా అధికారి

ACB Attack On Insurance Officer Khammam - Sakshi

ఖమ్మంక్రైం: బీమా శాఖలో పనిచేస్తున్న ఓ అవినీతి చేప సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కింది. ఉద్యోగ విరమణ పొందిన వారిని లక్ష్యంగా పెట్టుకొని ఏళ్లతరబడి  వారి వద్ద లంచాలు తింటున్న ఉన్నతాధికారి బండారం ఎట్టకేలకు బట్టబయలు అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం నగరానికి చెందిన కొండపర్తి   బుచ్చయ్య ఎస్‌ఐగా పనిచేసి మే నెలలో ఉద్యోగ విరమణ పొందాడు. అతనికి రాపర్తినగర్‌లోని ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి రూ.1,89,238లు రావలసివుంది. వీటి కోసం ఆయన గత నెల 18 నుంచి బీమా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కార్యాలయంలో ఉన్నతాధికారి ఏడీ మోహన్‌రావును కలువగా తనకు ఎనిమిది వేల రూపాయలు లంచం ఇస్తే బీమా సొమ్మును రిలీజ్‌చేస్తామని తెలిపాడు. తాను పోలీస్‌ అధికారిని అని కూడా చెప్పాడు. ఇక్కడ ఎవరైనా ఒకటే.. లంచం ఇస్తేనే పని అవుతుందని మోహన్‌రావు తేల్చిచెప్పాడు.

ఆయనకు ముట్ట చెబితేనే ..  
ఏసీబీకి పట్టుబడ్డ మోహన్‌రావు గతంలో నిజామాబాద్, కర్నూలు తదితర ప్రాంతాల్లో పనిచేసాడు. తన కార్యాలయానికి బీమా డబ్బు కోసం వచ్చే  ఉద్యోగ విరమణ పొందిన వారికి రావలసిన సొమ్ము చెల్లించాలంటే ఈ అధికారికి లంచం ఇవ్వాల్సిందే. అటెండర్‌ నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరైనా ఈ అధికారికి లంచం ముట్టజెప్పితేనే, లేదంటే  చెప్పులు అరిగిపోవాల్సిందే. కార్యాలయం చుట్టూ తిరగలేక చివరకు ఏడీ మోహన్‌రావు అడిగిన లంచం చెల్లిస్తూ ఉంటారు.
 
ఇలా చిక్కిన అవినీతి చేప.. 
ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌ఐ బుచ్చయ్యను పదేపదే  లంచం అడుగుతుండగా చివరకు విసిగిపోయిన ఆయన ఏసీబీ సిబ్బందిని ఆశ్రయించాడు. దీంతో మోహన్‌రావును అరెస్ట్‌ చేయడానికి  సిబ్బంది పథకం వేసారు. ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ అధ్వర్యంలో రసాయనం పూసిన ఐదువందల రూపాయలు ఎనిమిదివేలను బుచ్చయ్యకు సోమవారం ఇచ్చి పంపారు. బుచ్చయ్య వెళ్లి ఏడీ మోహన్‌రావును కలిసి ఎనిమిది వేల రూపాయలను ఇచ్చాడు. అదే సమయంలో అప్పటికే అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ సిబ్బంది ఒక్కసారిగా దాడి చేసి మోహన్‌రావును రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు.

ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటనతో కార్యాలయంలో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఏసీబీ బృందం  వెళ్లేవరకు ఎల్‌ఐసీ ఉద్యోగులను ఎవరినీ బయటకు వెళ్లనివ్వలేదు. మోహన్‌రావును  ప్రత్యేక న్యాయస్థానంలో మంగళవారం హాజరుపరుస్తామని డీఎస్పీ కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఈ దాడిలో ఖమ్మం ఏసీబీ సీఐలు రమణమూర్తి, ప్రవీణ్‌కుమార్, వరంగల్‌ ఏసీబీ సీఐలు çవెంకట్, క్రాంతికుమార్‌ సిబ్బంది చారి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top