అవినీతి తిమింగళాలు..

ACB  Arrested VRO In Rangareddy - Sakshi

లంచాల కోసం రైతులను పీల్చిపిప్పిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది 

ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కానరాని మార్పు 

సాక్షి, షాద్‌నగర్‌: ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా రెవెన్యూ సిబ్బందిలో మార్పు కానరావడం లేదు. యథేచ్ఛగా అక్రమాలను కొనసాగిస్తున్నారు. చిన్నచిన్న పనుల కోసం వచ్చే రైతులను లంచాల పేరుతో వేధిస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ రైతు నుంచి కొందుర్గు వీఆర్వో రూ.4లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. హైదరాబాద్‌లోని కేశంపేట వీఆర్వో ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. ఒకే రోజు జరిగిన ఈ రెండు ఘటనలు రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపాయి.   

భూమి ఆన్‌లైన్‌లో నమోదుకు రూ.9లక్షలు లంచం డిమాండ్‌ 
కొందర్గు వీఆర్‌ఓ అనంతయ్య ఇటీవల కేశంపేట నుంచి బదిలీపై  వచ్చారు. కాగా, కేశంపేట మండలం దత్తాయపల్లె శివారులో సర్వే నంబర్‌ 85/ఆ లో 9–07 ఎకరాల విస్తీర్ణం భూమి మామిడిపల్లి చెన్నయ్య పేరున పట్టా ఉంది. వీఆర్‌ఓ అనంతయ్య చెన్నయ్యకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చే సమయంలో రూ.30 వేలు లంచం తీసుకున్నాడు. ఆ తర్వాత అనంతయ్య జూన్‌ 13న కొందుర్గు బదిలీపై వచ్చారు. అయితే, రైతు చెన్నయ్యకు సంబందించిన భూమి 2019 జూన్‌ 18 వరకు ఆన్‌లైన్‌లో ఆయన  పేరుపైనే కనిపించింది. కానీ, జూన్‌ 24న ఆన్‌లైన్‌లో చూడగా ఆ భూమి కనిపించలేదు. దీంతో బాధిత రైతు సంబందిత వీఆర్‌ఓ అనంతయ్యను సంప్రదించారు.

దీంతో ఆన్‌లైన్‌లో నమోదు చేయడం కోసం రూ.9 లక్షలు కావాలని, తనతోపాటు తహశీల్దార్‌ లావణ్యకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని అనంతయ్య రైతు చెన్నయ్య, అతడి కుమారుడు భాస్కర్‌కు చెప్పాడు. దీంతో వారు రూ.8 లక్షలు లంచం ఇవ్వడానికి వీఆర్‌ఓ అనంతయ్యతో ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయమై రైతు చెన్నయ్య కుమారుడు భాస్కర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తహశీల్దార్‌ కార్యాలయంలో ఉన్న వీఆర్‌ఓ అనంతయ్యకు బుధవారం భాస్కర్‌ రూ.4 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ దాడల్లో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు గంగాధర్, మాజీద్, రామలింగారెడ్డి, నాగేంద్రబాబు పాల్గొన్నారు. 

రూ.9లక్షలు అడిగాడు : భాస్కర్‌ 
1951లో మా నాన్న చెన్నయ్య భూమి కొనుగోలు చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు కూడా వచ్చాయి. ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేశారు. కానీ, తిరిగి ఆన్‌లైన్‌లో నుంచి తొలగించారు. ఆన్‌లైన్‌ నమోదు చేయాలంటే రూ.9 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా రూ. 8లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నాం. 

నాలుగు బృందాలుగా ఏర్పడి.. 
అవినీతికి పాల్పడుతున్న రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి అవినీతి చేపలను పట్టుకున్నారు.  అయితే బుధవారం ఏసీబీ అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి కొందుర్గు, షాద్‌నగర్, కేశంపేట రెవెన్యూ కార్యాలయాలతో పాటుగా, హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్న కేశంపేట తహిసీల్దార్‌ లావణ్య ఇంటిపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కొందుర్గు తహిసీల్దార్‌ కార్యాలయంలో రైతు మామిడిపల్లి భాస్కర్‌  రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో షాద్‌నగర్‌ పట్టణంలోని ఆర్‌డీఓ కార్యాలయంతో పాటు కేశంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో  రైతుకు సంబంధించిన భూరికార్డులను అధికారులు పరిశీలించారు.

ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం కార్యాలయంలోని కంప్యూటర్లతో పాటుగా, రికార్డులను పరిశీలించారు. భారీ మొత్తంలో లంచం డిమాండ్‌ చేసి తీసుకోవడం వెనక ఎవరెవరు ఉన్నారన్న విషయంపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. రైతు మామిడిపల్లి భాస్కర్‌కు సంబంధించిన భూమి వివరాలను ఓసారి ఆన్‌లైన్‌లో నమోదు చేసి కొన్ని రోజుల తర్వాత  ఏవిధంగా తొలగించారన్న విషయంపై ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. 

వీఆర్వో బదిలీ అయినా 
కేశంపేట మండలంలో సుమారు పదేళ్ళకు పైగా అనంతయ్య వీఆర్వోగా పనిచేశారు. కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ, దత్తాయపల్లి, ఇప్పలపల్లి, కేశంపేట గ్రామాల్లో వీఆర్వోగా పనిచేసిన అనంతయ్యపై పలు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కేశంపేటకు చెందిన చందన అనే మహిళా రైతుకు సంబంధించిన భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో ఆమె తహిసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

అయితే ఈ వ్యవహారంలో తహిసీల్దార్‌ లావణ్య, వీఆర్వోలు ఇబ్బందులు పెడుతున్నారని మహిళా రైతు ఆరోపణలు చేసింది. ఇటీవల జిల్లా అధికారులు వీఆర్వోల బదిలీల నేపథ్యంలో అనంతయ్యను కొందుర్గు మండల కేంద్రానికి బదిలీ చేశారు. ఆయన బదిలీ అయినా కేశంపేట మండలానికి సంబంధించిన రైతుల భూ వ్యవహరాల్లో తలదూర్చి ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఇటీవల షాద్‌నగర్‌ ఆర్‌డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ రైతు కేశంపేట తహిసీల్దార్‌ లావణ్య కాళ్లుపట్టుకొని భూ సమస్యను పరిష్కరించాలని వేడుకున్న సంఘటన ఆ రోజు చర్చనీయాంశమైంది.   

ఆర్డీఓ కార్యాలయ అధికారుల పాత్ర?  
వీఆర్వో భారీ ఎత్తున లంచం డిమాండ్‌ చేయడంలో ఆర్డీఓ కార్యాలయంలో పనిచేసే అధికారుల హస్తం ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నా.. తొలగించాలన్నా.. ఆర్‌డీఓ కార్యాలయం అధికారుల ప్రమేయం కూడా ఉంటుంది. అయితే భూమికి సంబంధించిన వివరాలను ఒకసారి ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత.. తొలగించడంలో ఎవరెవరి పాత్ర ఉంది, లంచాలు ఎవరెవరు డిమాండ్‌ చేశారు అనే కోణంలో ఏసీబీ అధికారులు  దర్యాపు చేపడుతున్నట్లు తెలిసింది.  

ఉలిక్కిపడిన అధికారులు  
రెవెన్యూ అధికారులు ఏసీబీకి పట్టుబడటంతో షాద్‌నగర్‌ డివిజన్‌లోని అన్ని శాఖల అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కొందరు అధికారులు సమయాని కంటే ముందే కార్యాలయాల నుంచి వెళ్లిపోయారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున లంచం తీసుకుంటూ పట్టుబడటం, ఏకకాలంలో కార్యాలయాల్లో తనిఖీలు జరగడంతో అసలు ఏం జరుగుతుందోనని, ఎవరెవరు మెడకు ఉచ్చుబిగించుకుంటుందనే చర్చ జరుగుతోంది. 

అవినీతి దందాలో కుమ్మక్కు 
తహసీల్దార్, వీఆర్వో ఇద్దరు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే రైతుకు సంబంధించిన భూమి వివరాలను ఆన్‌లైన్‌ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. భూ వివరాలను ఆన్‌లైన్‌ నుంచి తొలగించాలంటే.. ఎందుకు తొలగించాల్సి వస్తుందోనన్న వివరాలను రైతుకు తెలియజేయడంతో పాటుగా దీనికి సంబంధించిన ప్రొసీడింగ్‌లు విధిగా ఉండాలని, అప్పుడే  ఆన్‌లైన్‌లో నుంచి తొలగించేందుకు అవకాశం ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ, ఇక్కడ మాత్రం అలాందేమీ లేకుండా ఆన్‌లైన్‌లో వివరాలు తొలగించినట్లు తెలుస్తోంది.  

లంచం అడిగితే సమాచారం ఇవ్వండి 
ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సూర్యానారాయణ సూచించారు. అధికారులు లంచం అడిగితే 9440446140 సంప్రదించాలని తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top