
సోదా చేస్తున్న ఏసీబీ అధికారులు..సర్కిల్‌లో వెంకటరమణ
మదనపల్లె టౌన్: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే అభియోగంపై చిత్తూరు జిల్లా మదనపల్లె హంద్రీ–నీవా సుజల స్రవంతి డిప్యూటీ ల్యాండ్ సర్వేయర్ జి.వెంకటరమణను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి విలేకరులకు తెలిపిన వివరాలు.. మదనపల్లె ఎస్‌బీఐ కాలనీలో నివసిస్తున్న వెంకటరమణ మదనపల్లె తహశీల్దార్ కార్యాలయంలో రెగ్యులర్ సర్వేయర్‌గానూ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ విభాగంలో డిప్యూటీ ల్యాండ్ సర్వేయర్‌గానూ పనిచేస్తున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో వెంకటరమణ ఇంటిపై ఏఎస్పీ నేతృత్వంలో సీఐలు ప్రసాద్‌రెడ్డి, విజయేశ్వర్, గిరిధర్, మంగళవారం దాడులు నిర్వహించారు. మదనపల్లెలోని మూడు ప్రాంతాల్లోనూ, చౌడేపల్లె మండలం దుర్గసముద్రం, పుంగనూరు, నెల్లూరు జిల్లాలోని గూడూరు, కొత్తపల్లెలో ఏకకాలంలో ఆరు బృందాలతో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి సుమారు రూ.16 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు గుర్తించారు. అలాగే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సర్వేయర్ పేరుమీద రెండు డూప్లెక్స్ ఇళ్లు, భార్య జోత్స్న పేరుతో మరో రెండు డూప్లెక్స్ ఇళ్లు, జీప్లస్ టు భవనం, ఒక బయో ప్రొడక్టŠస్ ఫ్యాక్టరీ, కారు, బైకుతో పాటు పుంగనూరు రోడ్డులోని వలసపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో రెండు షెడ్లు ఉన్నట్లు గుర్తించారు.
వీటితో పాటు రూ. 1.40 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. 1996 మార్చిలో వెంకటరమణ సర్వేయర్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి చిత్తూరు జిల్లాలోనే పనిచేస్తున్నారు. ఆరేళ్ల క్రితం మదనపల్లె తహశీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. వెంకటరమణను అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీకోర్టుకు తరలిస్తున్నట్లు ఏఎస్పీ వివరించారు.