బాల్యాన్ని చిదిమేస్తున్నారు..

50 Percent Rape Cases on Minors Filed in That Five States - Sakshi

మనదేశంలో గత పదేళ్ళలో రేప్‌కి గురైన లక్షమందికిపైగా పసికూనలు

50 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లో నమోదైనవే

దేశంలో పసికూనలపై అఘాయిత్యాలకు కశ్మీర్‌లోని కతువా ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. జమ్మూకాశ్మీర్‌లోని కతువాలో ఎనిమిదేళ్ళ పసికూనపై జరిగిన అత్యాచారం కానీ, గుజరాత్‌లు తీవ్రమైన గాయాలతో బయటపడ్డ తొమ్మిదేళ్ళ చిన్నారి అత్యాచారం కేసు సహా ఉత్తర ప్రదేశ్, ఒరిస్సాల్లో ఈ మధ్యే  వెలుగులోకి వచ్చిన ఇద్దరు చిన్నారుల అత్యాచారం కేసుల నేపథ్యంలో ఇటీవలి కాలంలో మైనర్‌ బాలికలపై అత్యాచారం కేసులను పరిశీలిస్తే మన దేశంలో మైనర్‌ బాలికలపై అత్యాచారాలు 500 శాతం పెరిగినట్టు తేలింది. గత పదేళ్ళలో మైనర్‌ బాలికల మీద అత్యాచారాలు 500 శాతం పెరిగినట్టు చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యు (సిఆర్‌వై) నిర్వహించిన తాజా పరిశోధన తేల్చింది. సిఆర్‌వై సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో మన దేశంలో 2006లో 18,967 మంది మైనర్‌ బాలికలు అత్యాచారాల బారిన పడితే 2016కి వచ్చేసరికి అంటే కేవలం పదేళ్ళలో 106,958 మంది మైనర్‌ బాలికలపై అత్యాచారాలు జరిగినట్టు తేలింది. ఇందులో 50 శాతానికిపైగా నేరాలు కేవలం ఐదు రాష్ట్రాల్లో నమోదైనవే. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లోనే చిన్నారులపై 50 శాతం అత్యాచార కేసులు నమోదైనట్టు క్రై(సిఆర్‌వై) చిల్డ్రన్‌ రైట్స్‌ అండ్‌ యు అనే సంస్థ వెల్లడించింది. 

చిన్నారులపై అత్యాచారాల్లో ఉత్తర ప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉండడం ఆ రాష్ట్రంలో చిన్నారులకున్న రక్షణని ప్రశ్నార్థకంగా మార్చింది. మైనర్‌ బాలికలపై అత్యాచారాలు జరిగినట్టు నమోదైన కేసుల్లో 15 శాతం ఉత్తరప్రదేశ్‌లోనూ, మహారాష్ట్రలో 14 శాతం, మధ్యప్రదేశ్‌లో 13శాతం జరిగినట్టు నేర పరిశోధనా గణాంకాలు వెల్లడించాయి. 

2016 నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం 2015తో పోలిస్తే మన దేశంలో  చిన్నారులపై నేరాల సంఖ్య 14 శాతం పెరిగింది. అదేవిధంగా దేశంలో  2016 ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్స్‌(పోక్సో) యాక్ట్‌  ప్రకారం పరిశీలిస్తే చిన్నారులపై జరుగుతోన్న నేరాల్లో మూడొంతులు లైంగిక పరమైనవే. ఈ గణాంకాల ప్రకారం మన దేశంలో  ప్రతి 15 నిముషాలకు ఒక పసికూన లైంగిక నేరాల బారిన పడుతోంది. గత ఐదేళ్లలోనే చిన్నారులపై లైంగిక నేరాలు 300 శాతం పెరగడం ప్రమాదం తీవ్రతని ప్రతిబింబిస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top