ఆరే కాలనీలో 29 మంది అరెస్ట్‌ | 29 people booked for protesting against tree cutting | Sakshi
Sakshi News home page

ఆరే కాలనీలో 29 మంది అరెస్ట్‌

Oct 6 2019 4:31 AM | Updated on Oct 6 2019 4:31 AM

29 people booked for protesting against tree cutting - Sakshi

నేలకూలిన చెట్టును పట్టుకుని రోదిస్తున్న కాలనీవాసి

ముంబై: మెట్రో కారు షెడ్డు నిర్మాణం కోసం ముంబై ఆరే కాలనీలోని ప్రముఖ గ్రీన్‌ లంగ్‌ స్పేస్‌లో చెట్లు నరికివేయడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రే చాలా మంది నిరసనకారులు చెట్టు కొట్టేయడానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం  చేశారు. అయితే శనివారం ఉదయం పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరగడంతో 29 మందిని అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ముంబై మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అధికారులు శనివారం ఉదయం ఆరే కాలనీలో చెట్లు కొట్టేసేందుకు రాగా, కాలనీలోని పర్యావరణ ప్రేమికులు భారీగా వచ్చి అడ్డుకున్నారు. కాగా, ఆరే కాలనీలోని దాదాపు 2,656 చెట్లు నరికేయకుండా ఆపాలని కోరుతూ ఎన్జీవోలు, పర్యావరణవేత్తలు నాలుగు పిటిషన్లు దాఖలు చేశారు.

అయితే చెట్లు కొట్టేయకుండా స్టే విధించేందుకు న్యాయమూర్తులు జస్టిస్‌ ధర్మాధికారి, జస్టిస్‌ ఏకే మీనన్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వివాదంపై ప్రతిపక్షాలు అధికార బీజేపీపై తీవ్రంగా మండిపడుతున్నాయి. కాగా, ఆరే కాలనీలో చెట్లు కొట్టేయడం సిగ్గుచేటని శివసేన నేత ఆదిత్య ఠాక్రే ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ముంబై మెట్రో–3 అధికారులను పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌కు బదిలీ చేయాలంటూ మండిపడ్డారు. ఆరే కాలనీలో చెట్లు కొట్టేయకుండా పర్యావరణవేత్తలు, స్థానిక శివసేన కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసు బలగాలను మోహరించి ఆరే కాలనీలో విధ్వంసం సృష్టిస్తున్నారని అధికారులపై ఆరోపణలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement