తల్లిని బూతులు తిట్టాడని.. మనస్తాపంతో

10th Class Student Commits Suicide By Principal Scolding - Sakshi

సాక్షి, టేకులపల్లి(ఖమ్మం): హెచ్‌ఎం తిట్టి అవమానించడంతో ఓ గిరిజన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన టేకులపల్లి మండల పరిధిలోని కోయగూడెం ఆశ్రమపాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఆళ్ళపల్లి మండలం కిచ్చెనపల్లికి చెందిన పాయం విజయ కుమారుడు సాయికిరణ్‌(15) కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. విద్యార్థి మేనమామ సురేష్‌ ఇదే పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. సాయికిరణ్‌ను తీసుకుని సురేష్‌ శనివారం మేడారంలో బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. ఆదివారం అర్ధరాత్రి తిరిగి సంపత్‌నగర్‌కు చేరుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో సంతోష్‌కుమార్‌ తన సోదరుడు సాయికిరణ్‌(15)ను పాఠశాలలో వదిలి వెళ్లాడు.

వాచ్‌మెన్‌ గదిలోకి వెళ్తున్న విద్యార్థిని హెచ్‌ఎం బాదావత్‌ దేవాసింగ్‌ పిలిచి ఎక్కడి నుంచి వస్తున్నావని అడిగారు. శుభకార్యానికి వెళ్లొస్తున్నట్లు విద్యార్థి తెలిపాడు. అంతటితో ఆగని హెచ్‌ఎం పదో తరగతి చదువుతున్నావ్‌.. క్లాసులు ఎగ్గొట్టి ఊర్లు తిరుగుతావా... అంటూ మేనమామను, తల్లిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ కర్రతో చితకబాదాడు. దీంతో మనస్తాపం చెందిన సాయికిరణ్‌ పాఠశాల ఆవరణలోనే ఉన్న తన మావయ్య(వాచ్‌మెన్‌) గదిలోకి వెళ్ళి తలుపునకు గడి పెట్టుకున్నాడు. ఎంతకీ బయటకు రాలేదు. మధ్యాహ్నం భోజనం సమయంలో విద్యార్థులు వెళ్ళి తలుపు కొడితే తీయలేదు. సాయంత్రం ఆరు గంటల సమయంలో వాచ్‌మెన్‌ బంధువు హాస్టల్‌కి వచ్చింది. సాయికిరణ్‌ను కలిసేందుకు గదికి వెళ్ళి తలుపు కొడితే మళ్ళీ అదే పరిస్థితి. అనుమానం వచ్చి వార్డెన్‌ విద్యార్థుల సహాయంతో వెంటిలేటర్‌ ద్వారా లోపలికి చూసేసరికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉన్నాడు.

వెంటనే తలుపులు పగులగొట్టి కిందకు దింపారు. సీఐ బాణోతు రాజు, ఎస్‌ఐ ఇమ్మడి రాజ్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. విద్యార్థి రాసిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లి రాకముందే విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం తరలించారు. కాగా సాయికిరణ్‌ తండ్రి రాంచందర్‌ నాలుగేళ్ల క్రితమే మృతి చెందాడు. సోదరు డు సంతోష్‌కుమార్‌ పాకాల కొత్తగూడెంలో ఇంటర్‌ చదువుతున్నాడు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ మృతదేహాన్ని సందర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల ని అధికారులను ఆదేశించారు. మృతదేహాన్ని స్థానిక సర్పంచ్‌ పూనెం ఉమ, ఎంపీటీసీ జాల సంధ్య సందర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా హెచ్‌ఎం దేవాసింగ్‌ వివాదాస్పద వ్యక్తి అని, గతంలో రెండు సార్లు సస్పెన్షన్‌కు గురయ్యారని పలువురు పేర్కొంటున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top