జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ బంపర్‌ ఫలితాలు 

Zumbant Foods Bumper Results - Sakshi

సెప్టెంబర్‌లో 60% పెరిగిన లాభం

పెరిగిన ఆన్‌లైన్‌ విక్రయాలు

న్యూఢిల్లీ: డామినోస్‌ పిజ్జా, డంకిన్‌ డోనట్స్‌ బ్రాండ్లపై ఫుడ్‌ స్టోర్లను నిర్వహించే జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. లాభం 60 శాతం పెరిగి రూ.77.67 కోట్లకు చేరుకుంది. డామినోస్‌ పిజ్జా స్టోర్ల నుంచి అధిక అమ్మకాలు లాభాల వృద్ధికి తోడ్పడ్డాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.48 కోట్లుగా ఉంది. కంపెనీ మొత్తం ఆదాయం సైతం సెప్టెంబర్‌ త్రైమాసికంలో 22 శాతం పెరిగి రూ.892 కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యయాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.657 కోట్ల నుంచి రూ.772 కోట్లకు పెరిగినట్టు జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ తెలిపింది. ‘‘సెప్టెంబర్‌ త్రైమాసికంలో స్టోర్ల ప్రారంభాన్ని పెంచాం. 24 కొత్త డామినోస్‌ స్టోర్లను తెరిచాం.

గత ఏడు త్రైమాసికాల కాలంలో ఈ స్థాయిలో స్టోర్లను ప్రారంభించింది సెప్టెంబర్‌ క్వార్టర్లోనే’’ అని జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ తెలిపింది. ఇక జూలై– సెప్టెంబర్‌ కాలంలో ఐదు డంకిన్‌ డోనట్స్‌ స్టోర్లను మూసేసింది. గతేడాదితో పోలిస్తే నష్టాలు సగానికంటే తగ్గినట్టు కంపెనీ తెలిపింది. ‘‘డెలివరీ ఆర్డర్లలో బలమైన వృద్ధి నెలకొంది. డిజిటల్‌పై దృష్టి పెట్టడంతో ఆన్‌లైన్‌ అమ్మకాలు పెరిగాయి. నూతన డామినోస్‌ యాప్‌కు యూజర్ల నుంచి మంచి రేటింగ్‌ ఉంది’’ అని కంపెనీ సీఈవో ప్రతీక్‌ పోట తెలిపారు. జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ సంస్థకు దేశవ్యాప్తంగా 269 పట్టణాల్లో 1,167 డామినోస్‌ పిజ్జా స్టోర్లు ఉన్నాయి. అలాగే, 10 పట్టణాల్లో 32 డంకిన్‌ డోనట్స్‌ స్టోర్లు సైతం ఉన్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top