
న్యూఢిల్లీ: వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలపై యువతరం అంతగా ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగ భద్రత లేకపోవడం, వ్యవసాయ రంగం వృద్ధిపై అవగాహన అంతగా లేకపోవడం, ఔత్సాహిక వ్యాపారవేత్తల స్ఫూర్తి లోపించడం ఇందకు కారణాలుగా ఉంటున్నాయి. ఉద్యోగావకాశాల వెబ్‌సైట్.. ఇన్‌డీడ్ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2017లో తమ పోర్టల్‌లో వ్యవసాయ సంబంధ ఉద్యోగాల కోసం జాబ్ సెర్చ్‌లు సగటున 25 శాతం తగ్గాయని సంస్థ తెలిపింది.
21–25 సంవత్సరాల వయస్సుగల ఉద్యోగార్థుల (తాజా గ్రాడ్యుయేట్స్ మొదలైన మిలీనియల్స్) నుంచి వ్యవసాయ సంబంధ ఉద్యోగాలపై అత్యంత తక్కువ ఆసక్తి వ్యక్తమవుతోంది. అయితే, 31–35 ఏళ్ల మధ్య వయస్సుగల వారు ఈ తరహా ఉద్యోగాలపై సగటు కన్నా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
ఆయా ఉద్యోగాలకు సంబంధించిన అవగాహన, సవాళ్లను ఎదుర్కొనడానికి అవసరమయ్యే నైపుణ్యాలను అప్పటికే సాధించడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. సర్వే ప్రకారం 2007 నుంచి చూస్తే వ్యవసాయ సంబంధ ఉద్యోగాల్లో చేరే యువత సంఖ్య 4 శాతం పెరిగింది. మొత్తం మీద ఉద్యోగ భద్రత ఉన్న పక్షంలో ఈ రంగంలో ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నట్లు సర్వే పేర్కొంది.
’సేంద్రియ’ సంస్థల్లో అవకాశాలు ..
2022 నాటికల్లా వ్యవసాయాదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా .. దేశీ రైతాంగం వేగవంతంగా యాంత్రీకరణకు అలవాటు పడుతున్న నేపథ్యంలో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా కనిపిస్తున్నాయని ఇన్‌డీడ్ ఇండియా ఎండీ శశి కుమార్ తెలిపారు.
అగ్రిబిజినెస్, వ్యవసాయ వనరుల నిర్వహణ, ఫుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీస్ మొదలైన అత్యాధునిక కోర్సులు కూడా ఈ రంగంలో రాణించేందుకు ఉపయోగపడగలవని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం ఎపిగామియా, పేపర్‌బోట్, యాంటీడోట్, 24 మంత్ర వంటి సేంద్రియ వ్యవసాయోత్పత్తుల సంస్థలు మరింతగా నియామకాలు జరిపే అవకాశాలు ఉన్నాయి.