
రతన్ టాటా, లక్ష్మీమిట్టల్, వినోద్ ఖోస్లా
తన వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని ప్రస్తుత జీవించివున్న వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు
శత వార్షికోత్సవ జాబితాలో చోటు
న్యూయార్క్: తన వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని ప్రస్తుత జీవించివున్న వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, మేధావుల సమ్మేళనంతో ఫోర్బ్స్ మ్యాగజీన్ తాజాగా ‘వరల్డ్ 100 గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్’ జాబితాను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. అర్సిలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్.. టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా.. సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లా ఇందులో ఉన్నారు. శతవార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన తాజా ప్రత్యేకమైన జాబితాలో డొనాల్డ్ ట్రంప్ కూడా స్థానం పొందారు. ఈయనతోపాటు అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, వర్జిన్ గ్రూప్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్, బార్క్‌షైర్ హత్‌వే సీఈవో వారన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రూపెర్ట్ ముర్డోచ్ వంటి ప్రముఖులు ఉన్నారు.
అలాగే సీఎన్‌ఎన్ ఫౌండర్ టెడ్ టర్నర్, టాల్క్ షో మాస్టర్ ఓఫ్రా విన్ఫ్రే, డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు మైకేల్ డెల్, పేపాల్/ టెస్లా/ స్పేస్‌ఎక్స్ కో–ఫౌండర్ ఎలెన్ మాస్క్, ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్, స్టార్‌బక్స్ సీఈవో హోవర్డ్ షుల్జ్, ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ వంటి పలువురు స్థానం పొందారు. కొత్త ఆవిష్కరణలతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న, ప్రపంచంపై తన వంతు ప్రభావాన్ని చూపిన 100 ఎంట్రప్రెన్యూర్లతో ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. కాగా ఫోర్బ్స్ మ్యాగజైన్‌ను బీసీ ఫోర్బ్స్.. వాల్టర్ డ్రేయ్‌తో కలిసి 1917 సెప్టెంబర్ 17న ఏర్పాటు చేశారు.