వ్యాపారాల్లో మహిళా నాయకత్వం పెరుగుతోంది | Womens leadership is growing in business | Sakshi
Sakshi News home page

వ్యాపారాల్లో మహిళా నాయకత్వం పెరుగుతోంది

Mar 9 2018 5:48 AM | Updated on Mar 9 2018 5:48 AM

Womens leadership is growing in business - Sakshi

న్యూఢిల్లీ: భారతీయ కంపెనీల్లో నాయకత్వ స్థానాల్లో మహిళల సంఖ్య పెరుగుతోందని తాజా నివేదిక పేర్కొంది. లింగ సమానత్వానికి సంబంధించి భారత్‌ ర్యాంకింగ్‌ ఇంకా అట్టడుగునే ఉన్నప్పటికీ, క్రమంగా మెరుగుపడుతోందని తెలిపింది. అత్యున్నత స్థానాల్లో మహిళలు 2018లో 20 శాతానికి పెరిగారని గ్రాంట్‌ థార్న్‌టన్‌ ‘వ్యాపారాల్లో మహిళలు: ప్రగతి దిశగా విధానాలు’ పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2017లో ఈ పరిమాణం 17 శాతంగా ఉంది. ఇక 2014లో 14 శాతం మాత్రమే. గతేడాది జూలై–డిసెంబర్‌ మధ్య 35 దేశాల్లో మధ్య స్థాయి వ్యాపార సంస్థలకు చెందిన దాదాపు 4,995 మంది సీఈఓలు, ఎండీలు, ఇతరత్రా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను తయారు చేసింది. ఇప్పటికీ తమ సంస్థల్లో నాయకత్వ స్థానాల్లో మహిళలు లేరని సర్వేల్లో పాల్గొన్న 30 శాతం భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పడం గమనార్హం.

భారత్‌లో వ్యాపారాలను నడిపిస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోందని. అయితే, ఈ పెరుగుదల చాలా నెమ్మదిగా ఉందని గ్రాంట్‌ థార్న్‌టన్‌ అడ్వయిజరీకి చెందిన కవితా మాథుర్‌ పేర్కొన్నారు. దేశీ వ్యాపార సంస్థల్లో స్త్రీ, పురుష సమానత్వానికి సంబంధించిన విధానాలు మెరుగ్గానే ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది. భారత్‌లోని దాదాపు 64 శాతం వ్యాపార సంస్థలు ఒకే పనికి సంబంధించి మహిళలు, పురుషులకు సమాన వేతనాలను ఇస్తున్నాయని.. అదేవిధంగా నియామకాల్లో కూడా 55 శాతం సంస్థలు వివక్షకు తావులేని విధానాలను అనుసరిస్తున్నాయని వివరించింది. కాగా, నాయకత్వ స్థానాల్లో మహిళలకు సంబంధించి సమానత్వాన్ని తీసుకురావాలంటే ప్రభుత్వం చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని సర్వేలో పాల్గొన్న 57 శాతం భారతీయ వ్యాపార సంస్థలు పేర్కొన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement