విప్రో చేతికి అమెరికా ‘అపిరియో’ | Wipro acquires US-based cloud services co Appirio for $500 mn | Sakshi
Sakshi News home page

విప్రో చేతికి అమెరికా ‘అపిరియో’

Oct 21 2016 12:40 AM | Updated on Sep 4 2017 5:48 PM

విప్రో చేతికి అమెరికా ‘అపిరియో’

విప్రో చేతికి అమెరికా ‘అపిరియో’

క్లౌడ్ సర్వీసులందజేసే అమెరికాకు చెందిన ‘అపిరియో’ సంస్థను దేశీ ఐటీ దిగ్గజం విప్రో రూ.3,340 కోట్లకు (50 కోట్ల డాలర్లు) కొనుగోలు చేసింది.

డీల్ విలువ రూ.3,340 కోట్లు
విప్రో కొనుగోళ్లలో ఇది రెండో అతిపెద్ద డీల్

న్యూఢిల్లీ: క్లౌడ్ సర్వీసులందజేసే అమెరికాకు చెందిన ‘అపిరియో’ సంస్థను దేశీ ఐటీ దిగ్గజం విప్రో రూ.3,340 కోట్లకు (50 కోట్ల డాలర్లు) కొనుగోలు చేసింది. కొత్త సర్వీసుల ద్వారా వృద్ధిని పెంచుకునేందుకు ఈ కంపెనీని కొనుగోలు చేసినట్లు విప్రో పేర్కొంది. విప్రో కొనుగోళ్లలో ఇదే రెండో అతి పెద్ద డీల్. పూర్తిగా నగదు చెల్లించే దీన్ని కొనుగోలు చేస్తున్నట్లు విప్రో పేర్కొంది. ఈ కొనుగోలు పూర్తయితే ప్రపంచంలోనే అతి పెద్ద క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషనల్ కంపెనీల్లో ఒకటిగా అవతరిస్తామని విప్రో సీఈఓ అబిదాలి జడ్ నీముచ్‌వాలా చెప్పారు.

ఈ కంపెనీ కొనుగోలుతో క్రౌడ్ సోర్సింగ్ మార్కెట్ ప్లేస్ టాప్‌కోడర్‌తో తమకు యాక్సెస్ ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది డిజైనర్లు, డెవలపర్లు, డేటా సైంటిస్ట్‌లు, వినియోగదారులతో టాప్‌కోడర్ అనుసంధానమై ఉంది. తాము సేల్స్‌ఫోర్స్, వర్క్‌డే పేర్లతో అందిస్తున్న క్లౌడ్ అప్లికేషన్లను అపిరియో బ్రాండ్ కింద ఏకీకృతం చేస్తామని, ఉమ్మడి వ్యాపారానికి ఆప్రియో సీఈఓ క్రిస్ బార్బిన్ నేతృత్వం వహిస్తారని తెలిపారు.

 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన అపిరియోకు జైపూర్, శాన్‌ఫ్రాన్సిస్కో, డబ్లిన్, లండన్, టోక్యోల్లో కార్యాలయాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1,250 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత ఏడాది ఈ కంపెనీ 20 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ కంపెనీకి.. కోక-కోలా, ఈబే, ఫేస్‌బుక్, హోమ్ డిపో, సోనీ ప్లే స్టేషన్ స్ట్రైకర్, రాబర్ట్ హాఫ్, జాన్సన్ కంట్రోల్స్, కార్డినల్ హెల్త్ వంటి కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. కాగా డీల్ ఈ ఏడాది చివరికల్లా ముగుస్తుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement