ఇక కిరాణా షాపుల్లోనూ వైఫై సేవలు

WIFI Services in General Stores - Sakshi

పీసీవో తరహా విధానం ప్రవేశపెట్టడంపై కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ వినియోగం గణనీయంగా ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో దుకాణాదారులు, రెస్టారెంట్లు మొదలైనవి కూడా వైఫై సేవలను విక్రయించే వెసులుబాటు తేవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. గతకాలపు పబ్లిక్‌ ఫోన్‌ బూత్‌ల (పీసీవో) తరహాలో ఈ వైఫై సర్వీసులు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా వైఫై హాట్‌స్పాట్స్‌ను పెంచే క్రమంలో పబ్లిక్‌ డేటా ఆఫీస్‌ (పీడీవో)ల పేరిట వీటిని ఏర్పాటు చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) సూచించింది.

అయితే, టెలికం సేవల సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో గతంలో దాన్ని పక్కన పెట్టారు. అయితే, ఏదో ఒక రూపంలో పీడీవో తరహా విధానాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్‌ తెలిపారు. ప్రస్తుత సైబర్‌ కేఫ్‌ల నిబంధనలకు లోబడి.. పబ్లిక్‌ డేటా ఆఫీస్‌ అగ్రిగేటర్లు (పీడీవోఏ) గతకాలపు పీసీవో తరహా సెటప్‌లో ఇంటర్నెట్‌ సర్వీసులు విక్రయించే అంశం పరిశీలించవచ్చని ట్రాయ్‌ సిఫార్సు చేసింది. కానీ, ఇప్పటికే తీవ్ర రుణభారంలో ఉన్న పరిశ్రమపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని, జాతీయ భద్రతకు కూడా ప్రమాదకరమని టెలికం ఆపరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top