సిలికాన్ వ్యాలీ వద్దు.. ఇండియా ముద్దు.. | Why Silicon Valley Desis Are Returning Home to Indian Tech Start-Ups | Sakshi
Sakshi News home page

సిలికాన్ వ్యాలీ వద్దు.. ఇండియా ముద్దు..

May 2 2015 12:00 AM | Updated on Sep 3 2017 1:14 AM

సిలికాన్ వ్యాలీ వద్దు.. ఇండియా ముద్దు..

సిలికాన్ వ్యాలీ వద్దు.. ఇండియా ముద్దు..

సిలికాన్ వ్యాలీకి పొలోమంటూ వెళ్లిన దేశీ ఇంజనీర్లు ప్రస్తుతం మళ్లీ భారత్ బాట పడుతున్నారు.

న్యూఢిల్లీ: సిలికాన్ వ్యాలీకి పొలోమంటూ వెళ్లిన దేశీ ఇంజనీర్లు ప్రస్తుతం మళ్లీ భారత్ బాట పడుతున్నారు. భారత్‌లో ఈ-కామర్స్ బూమ్, స్టార్టప్‌లలో భారీ జీతభత్యాలు, సదుపాయాలు వారిని స్వదేశంవైపు ఆకర్షిస్తున్నాయి. బిలియన్ల డాలర్ల కొద్దీ పెట్టుబడులు అందుకుంటున్న ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ సంస్థలు దానికి తగ్గట్లుగానే వ్యాపార విస్తరణ కోసం సిబ్బందిపై భారీగా వెచ్చిస్తున్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకే ఇంజనీర్లు మళ్లీ ఇంటిబాట పడుతున్నారు.

ఈ-కామర్స్‌లో రెండేళ్ల క్రితం వచ్చిన పెట్టుబడులు 2 బిలియన్ డాలర్ల కన్నా తక్కువగా ఉండగా.. గతేడాది ఏకంగా 5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చిపడ్డాయి. దీంతో తదుపరి దశ విస్తరణకు అవసరమైన నిపుణులను రిక్రూట్ చేసుకోవడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
 
దేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే  సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కి చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌ను రిక్రూట్ చేసుకుంది. వీరికి జీతభత్యాలు ఎంత ఆఫర్ చేసినదీ కంపెనీ వెల్లడించకపోయినప్పటికీ, 3-4 సంవత్సరాల్లో ఇవి 1 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని అంచనా. ఈ ఇద్దరూ భారతీయ ఇంజనీర్లే. ఇక స్నాప్‌డీల్, ఇన్‌మొబీ, జొమాటో వంటి దేశీ కంపెనీలు కూడా గడచిన అయిదేళ్లలో సుమారు 20 మంది ఉద్యోగులను సిలికాన్ వ్యాలీ నుంచి రిక్రూట్ చేసుకున్నాయి. ఇలా స్వదేశం తిరిగొస్తున్న ఇంజనీర్ల సంఖ్య ప్రస్తుతం నామమాత్రంగానే కనిపిస్తున్నా, అంతర్జాతీయ స్థాయిలో దేశీ స్టార్టప్‌లు ఎదుగుతున్నాయనడానికి సంకేతాలుగా పరిశ్రమ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
 
అనేక కారణాలు..
భారతీయ ఇంజనీర్లు తిరిగి వస్తుండటానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు కన్సల్టెంట్లు. వేగంగా ఎదుగుతున్న స్టార్టప్‌లలో భాగం కాగలగడం, చేరినప్పుడు లభించే బోనస్‌లు.. స్టాక్ ఆప్షన్లు, ఇతర భత్యాలు ఇంజనీర్లను ఆకర్షిస్తున్నాయని వారు చెబుతున్నారు. ఇవే కాకుండా తల్లిదండ్రులు, బంధువులకు దగ్గర్లో ఉండగలగటం మరో అదనపు ఆకర్షణగా ఉంటోంది. అయితే, జీతభత్యాల కన్నా స్టార్టప్‌లపైగల ఆసక్తే కొందరిని వెనక్కి రప్పిస్తోంది. అలాగని కంపెనీలేమీ వారికి తక్కువ చేయకుండా.. తగు సదుపాయాలు కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు  ఉద్యోగుల కుటుంబాల కోసం సమ్మర్ క్యాంపులు ఇతరత్రా నిర్వహిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement