బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ ప్రయోజనాలేమిటి?

What are the benefits of the Balance Fund? - Sakshi

ఏ ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోలో అయినా కనీసం ఒక బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ ఉంటే మంచిదని చాలా మంది విశ్లేషకులు సూచిస్తున్నారు. అసలు బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఎందుకు ఇన్వెస్ట్‌ చేయాలి ? బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం తప్పనిసరా ? –శ్రీహరి, విశాఖపట్టణం  
సాధారణంగా రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. మొదటిది.. పోర్ట్‌ఫోలియోను ఆటోమేటిక్‌గా రీబ్యాలన్స్‌ చేయడం. మీరు కొన్ని ఆర్థిక లక్ష్యాల కోసం కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. వీటిల్లో కొన్ని పనితీరు అధ్వానంగా ఉండవచ్చు. కొన్ని ఫండ్స్‌ పనితీరు మెరుగ్గా ఉండవచ్చు. పనితీరు బాగాలేని ఫండ్స్‌ నుంచి వేరే ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయాలి. దీనినే పోర్ట్‌ఫోలియో  రీబ్యాలన్స్‌గా పరిగణిస్తారు. ఇది కొంచెం శ్రమతో కూడుకున్న పని. మార్కెట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మీరు ఇన్వెస్ట్‌ చేసిన ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియోలను కూడా పరిశీలిస్తూ ఉండాలి.

కనీసం ఏడాదికొకసారైనా, పోర్ట్‌ఫోలియో మదింపు తప్పనిసరి. అలా కాకుండా మీ పోర్ట్‌ఫోలియోలో ఒక బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌  ఉందనుకోండి. మీ పోర్ట్‌ఫోలియో ఆటోమేటిక్‌గా రీ బ్యాలన్స్‌ అవుతుంది. అయితే మీ పోర్ట్‌ఫోలియోలో బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ ఉన్నా సరే కనీసం ఏడాదికి ఒకసారైనా మీ పోర్ట్‌ఫోలియోను మదింపు చేయడం మాత్రం మరచిపోవద్దు. ఇక రెండో విషయం.. పన్ను ప్రయోజనాలు... బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. పన్ను అంశాల పరంగా బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ను ఈక్విటీ ఫండ్‌గా పరిగణిస్తారు. బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ తన మొత్తం నిధుల్లో 35 శాతం వరకూ స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసినప్పటికీ, ఈ 35 శాతం ఆదాయంపై ఎలాంటి పన్ను భారం పడదు.  

ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌కు, ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌కు తేడా ఏమిటి ? –పల్లవి, హైదరాబాద్‌  
జ: ఈ రెండు ఫండ్స్‌కు చాలా తేడా ఉంది. ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌.. లిక్విడ్‌ ఫండ్స్‌ లానే రాబడులనిస్తాయి. ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌ ఈక్విటీ డెరివేటివ్స్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. అయితే వీటి రాబడులు తక్కువ స్థాయిల్లోనే ఉంటాయి. ఇక పన్ను అంశాల పరంగా చూస్తే, ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌ను లిక్విడ్‌ ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఇక ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ విషయానికొస్తే, ఈ ఫండ్స్‌ తన మొత్తం నిధుల్లో  మూడో వంతు ఈక్విటీలోనూ, మరో మూడు వంతు లిక్విడ్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేసే సాధనాల్లో, మరో మూడో వంతు స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి.

అందుకని దీర్ఘకాలం రాబడుల పరంగా చూస్తే, బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ కంటే తక్కువ రాబడులే వస్తాయి. అయితే ఈ ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌కు స్థిరత్వం ఎక్కువ. ఇక పన్ను అంశాల పరంగా చూసినా కూడా, ఈ ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, రాబడులు తక్కువగా ఉన్నా, స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు.   

న్యూ ఫండ్‌ ఆఫర్‌(ఎన్‌ఎఫ్‌ఓ)లో కాకుండా ప్రస్తుతమున్న ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయమని చాలా మంది ఎనలిస్ట్‌లు సలహా ఇస్తుంటారు కదా ! ఎన్‌ఎఫ్‌ఓల్లో ఎందుకు ఇన్వెస్ట్‌  చేయకూడదు?   –కిరణ్, విజయవాడ  
తెలియని దారిలో వెళ్లడం కన్నా తెలిసిన దారిలో వెళ్లడమే సులువు. అందుకని న్యూ ఫండ్‌ ఆఫర్‌(ఎన్‌ఎఫ్‌ఓ)లో ఇన్వెస్ట్‌ చేయడం కన్నా ప్రస్తుతమున్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడమే మంచిది. ప్రస్తుతమున్న ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియో గురించి మీకు ఒక అవగాహన ఉంటుంది. ఈ ఫండ్‌ ఏయే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుందో మీకు తెలుస్తుంది. అంతేకాకుండా గతంలో ఈ ఫండ్‌ పనితీరు ఎలా ఉంది...మార్కెట్‌ పెరిగినప్పుడు ఎలా ఉంది. మార్కెట్‌ పతన సమయాల్లో రాబడులు ఎంత ఇచ్చింది  తదితర విషయాల గురించి మీరు ఒక అవగాహన ఉంటుంది.  కానీ కొత్త ఫండ్‌ గురించి ఈ విషయాలేవీ మీకు తెలియవు. కొత్త ఫండ్‌ ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్‌మెంట్‌ మొదలు పెడుతుంది.

సాధారణంగా ఒక ఫండ్‌ భవిష్యత్తు పనితీరును ఆ ఫండ్‌ గత ట్రాక్‌ రికార్డ్‌ ఆధారంగా అంచనా వేస్తారు. కొత్త ఫండ్‌ భవిష్యత్తు పనితీరు అంచనాలకు అలాంటి ట్రాక్‌ రికార్డ్‌ ఉండదు. మరోవైపు ఫండ్‌ మొదలైనప్పుడే కొనుగోలు చేస్తే, చౌకగా కొనుగోలు చేసినట్లవుతుందని చాలా మంది భావిస్తారు. కానీ అది అసలు విషయమే కాదు. ఒక కంపెనీ ఐపీఓ(పబ్లిక్‌ ఆఫర్‌)కు వచ్చినప్పుడు ఉండే ధర, ఎన్‌ఎఫ్‌ఓ ఆరంభమైనప్పుడు ఫండ్‌ ధర ఒకలాంటివేనని చాలా మంది అపోహ పడుతుంటారు.

కంపెనీ ఐపీఓకు వచ్చినప్పుడు ఆ కంపెనీ పరిమిత సంఖ్యలోనే షేర్లను ఆఫర్‌ చేస్తుంది. దీంతో లిస్టింగ్‌ గెయిన్స్‌కు అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశం ఎన్‌ఎఫ్‌ఓకు ఉండదు. ఈ ఫండ్‌ ఎన్‌ఏవీపై ఈ ఫండ్‌కు ఉండే డిమాండ్‌ ఏమీ ప్రభావం చూపించదు. కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు గతంలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఒకే విధంగా(పోర్ట్‌ఫోలియో పరంగా) ఉండే ఎన్‌ఎఫ్‌ఓలను ఎక్కువగా ఆఫర్‌ చేసేవి. ఈ విషయంలో సెబి కఠినమైన నిబంధనలు రూపొందించడంతో ఎన్‌ఎఫ్‌ఓల జోరు తగ్గింది. ఏ రకంగా చూసినా, ఎన్‌ఎఫ్‌ఓల కంటే ప్రస్తుతమున్న ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమం.

- ధీరేంద్ర కుమార్‌ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top